విశాఖ భూదందా నేపథ్యంలో ఏపీ మంత్రులు గంటా శ్రీనివాసరావు, అయ్యన్నపాత్రుడు మధ్య విభేదాలు మరోసారి బయటకి వచ్చిన సంగతి తెలిసిందే. పార్టీ పరువు తీసేలా అయ్యన్న వ్యవహరిస్తున్నారంటూ ముఖ్యమంత్రికి గంటా శ్రీనివాసరావు లేఖ రాసిన సంగతి కూడా తెలిసిందే. పార్టీ ప్రతిష్ఠకు భంగం కలిగించే విధంగా గతంలో కూడా అన్నయ్య కామెంట్స్ చేశారంటూ సీఎంకు గంటా ఫిర్యాదు చేశారు. అయితే, ఈ లేఖ నేపథ్యంలో మంత్రుల మధ్య విభేదాలు తారస్థాయికి చేరాయని మరోసారి కథనాలు గుప్పుమన్నాయి. దీంతో ముఖ్యమంత్రి చంద్రబాబు దిద్దుబాటు చర్యలకు దిగారు. పార్టీ సమన్వయ కమిటీ భేటీ ఏర్పాటు చేశారు. విశాఖ భూ కుంభకోణంతోపాటు పార్టీలో నేతల క్రమశిక్షణ గురించి ముఖ్యమంత్రి ప్రధానంగా ఈ సమావేశంలో చర్చించినట్టు సమాచారం. ఈ సందర్భంగా మంత్రులు గంటా, అన్నయ్యలకు సీఎం క్లాస్ తీసుకున్నట్టు తెలుస్తోంది!
సమస్యలు ఉంటే వ్యక్తిగతంగా మాట్లాడుకుని పరిష్కరించుకోవాలని ఇద్దరు మంత్రులకూ సీఎం సూచించారట. పార్టీలో క్రమశిక్షణ మీరితే ఏ స్థాయివారైనా చర్యలు తీసుకునేందుకు వెనకాడేది లేదంటూ సీఎం హెచ్చరించినట్టు తెలుస్తోంది. అన్ని సమస్యలనూ ఇక్కడితో పరిష్కరించుకోవాలని వారికి చెప్పారట. అయితే, సీఎం క్లాసు మంత్రులపై బాగానే పనిచేసినట్టుగా ఉందని చెప్పాలి. అయ్యన్న పాత్రుడి స్పందనలో ఆ మార్పును గమనించొచ్చు.
సీఎంకు గంటా చేసిన ఫిర్యాదుపై మంత్రి అయ్యన్న పాత్రుడు స్పందించారు! విశాఖ భూదందా నేపథ్యంలో పరోక్షంగా గంటాను ఉద్దేశించి వ్యాఖ్యలు చేసిన అయ్యన్న… ఇప్పుడు అనూహ్యంగా మాట మార్చడం విశేషం. తామిద్దరం ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకోలేదనీ, అలాంటి అవసరం ఏముందనీ, విశాఖ వ్యవహారంపై సమగ్ర విచారణ జరగాలని మాత్రమే ఇద్దరం కోరుకున్నామని విశ్లేషించే ప్రయత్నం చేశారు. మంత్రుల మధ్య ల్యాండ్ వార్ అంటూ మీడియాలో వచ్చిన కథనాల్లో వాస్తవాలు లేవని అయ్యన్న కొట్టి పారేశారు. పేదలకు అన్యాయం జరగకూడదన్న ఉద్దేశంతోనే తామిద్దరం ప్రయత్నిస్తున్నామని అన్నారు.
విశాఖ భూముల విషయంలో న్యాయం జరగాలని తామిద్దరం కోరుకున్నామనీ, తదనుగుణంగానే ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ముఖ్యమంత్రి నియమించడం సంతోషంగా ఉందని అయ్యన్న చెప్పారు. పేదవాడికి అన్యాయం జరగకూడదన్న ఉద్దేశంతో సిట్ వేస్తే… తెలుగుదేశం ప్రతిష్ట పెరుగుతుందేగానీ, ఎక్కడ తగ్గుతుందీ అంటూ ఉల్టా ప్రశ్నించారు. సో… సమన్వయ కమిటీ భేటీ తరువాత అయ్యన్న పాత్రుడి స్పందన ఇలా మారింది! ముఖ్యమంత్రి వేసిన క్లాసు ఈ మంత్రులపై బాగానే పనిచేసిందని చెప్పడానికి ఇదే సంకేతం అనుకోవచ్చు కదా! అయితే, ఇది వారి మధ్య విభేదాలకు ఇది తాత్కాలిక ఉపశమనమా.. శాశ్వత పరిష్కార ప్రయత్నమా అనేది కొద్దిరోజులు గడిస్తేగానీ తెలీదు!