ఆంధ్రప్రదేశ్‌లో రాజకీయ పార్టీలు… అధికారమే పరమావధిగా.. పరుగులు పెడుతున్నాయి. తమ సొమ్మేదో.. ఇస్తున్నట్లుగా… ఉచితాల మీద ఉచితాలు ప్రకటిస్తున్నాయి. ప్రజలు ఓట్లేస్తే.. చాలు ఉన్నట్లుగా… భవిష్యత్ గురించి ఆలోచించకుండా.. హామీల మీద హామీలు గుప్పిస్తున్నాయి. వృద్ధులకు రూ. 200 ఉండే పెన్షన్ రూ. రెండు వేలు చేశారు. నేను మూడు వేలు చేస్తానని జగన్ చెప్పారు. వెంటనే చంద్రబాబు కూడా అదే మాట అందుకున్నారు. యాభై లక్షల మందికి నెలకు రూ. మూడు వెలు ఇవ్వడం అంటే.. మామూలు విషయం కాదు. ఇది ఒక్కటి మాత్రమే కాదు.. ఇలాంటివి చాలా ఆణిముత్యాలు రెండు పార్టీల నుంచి వచ్చి పడుతున్నాయి. తాజాగా.. చంద్రబాబు ఇచ్చిన వరం.. ఇళ్లకు.. ఎలాంటి రుసుములు కట్టాల్సిన పని లేదని.. లోన్లన్నీ మాఫీ చేస్తామన్నది ఆ హామీ.
వైఎస్ఆర్ కాంగ్రెస్ అధినేత జగన్మోహన్ రెడ్డి చాలా రోజుల నుంచి ఇళ్ల గురించి మాట్లాడుతున్నారు. ప్రజల దగ్గర్నుంచి చంద్రబాబు ఇళ్ల పేరుతో డబ్బులు వసూలు చేస్తున్నారని ఆరోపణలు గుప్పిస్తున్నారు. ప్రజలు నెలనెలా రుణవాయిదాలు చెల్లించడం అంటే.. చంద్రబాబు దోపిడీ చేయడమేనని చెప్పుకొస్తున్నారు. ఈ క్రమంలో.. తానొస్తే..రుణాలన్నీ మాఫీ చేసేస్తానని ప్రకటిస్తున్నారు. దీంతో.. పదకొండు లక్షల ఇళ్లను కట్టి లబ్దిదారులకు పంపిణీ చేసిన.. ప్రభుత్వం.. ఆ ఫలం తమకు దక్కదేమోనని.. రుణం మాఫీ చేస్తారని.. జగన్‌కే ఓటు వేస్తారని భయపడింది. వెంటనే.. అదే మాటను.. టీడీపీ కూడా అందుకుంది. చంద్రబాబు కూడా.. ఇళ్లపై ఉన్నరుణాలన్నింటినీ మాఫీ చేస్తానని ప్రకటించేశారు.
టీడీపీ ఇచ్చిన హామీ ప్రకారం.. రద్దు చేయనున్న ఈ బకాయిల విలువ రూ.30,264 కోట్లు. ఈ హామీ గ్రామీణ, పట్టణ పరిధిలో లబ్ధిదారులు అందరికీ వర్తిస్తుంది. ఉచితంగా వచ్చిన వాటికి విలువ ఉండదు. ఏదైనా కష్టపడి సంపాదించుకున్న దానికే… విలువ ఉంటుంది. అది జీవిత సత్యం. ప్రజలకు అన్నీ ఉచితంగా ఇచ్చే బదులుగా…వాటిని సమకూర్చుకునే శక్తిసామర్థ్యాలు ఇవ్వాలి కానీ.. ఇలా అన్నీ.. ఉచితం..రుణమాఫీ అంటూ పోతే… మానవవనరులే … లేజీగా తయారవుతాయన్న వాదన వినిపిస్తోంది. కానీ.. ఓట్ల కోసం.. భవిష్యత్ ను పట్టించుకోకుండా.. ప్రభుత్వ సొమ్మే కదా.. పంచితే అధికారం వస్తుందని… బరితెగిస్తున్నారు. ఇప్పటికి వారికి తాత్కలికంగా అధికారం రావొచ్చేమో.. కానీ ఆంధ్రప్రదేశ్ భవిష్యత్ కు మాత్రం దెబ్బే..!