దేశాన్ని తాను బలోపేతం చేస్తూంటే, మహాకూటమి నేతలు బలహీనం చేసే ప్రయత్నం చేస్తున్నారని నరేంద్రమోడీ విశాఖలో ఆవేదన వ్యక్తం చేశారు. ఇండియాపై తీవ్రవాద దాడులు చేస్తున్న పాక్ వైఖరిని ప్రపంచమంతా తప్పుపడుతోందని.. దేశంలో కొందరు నాయకులు మాత్రం పాకిస్థాన్ కు అనుకూలంగా మాట్లాడుతున్నారని విమర్శించారు. సైనిక బలగాల ఆత్మస్థైర్యం దెబ్బతిసేలా మాట్లాడుతున్నారని ఆరోపించారు. అలాంటి నాయకులను పాకిస్థాన్ పార్లమెంట్ పొగడ్తలతో ముంచెత్తుతోందని విమర్శించారు. మహాకూటమి నేతలను నేను ఒక్కటే అడుగుతున్నానని ..బలహీన ప్రభుత్వం ఏర్పాటు కావాలని, దేశం బలహీనం కావాలని ఎందుకు కోరుకుంటున్నారని ప్రశ్నించారు. తాను ఉంటేనే దేశం బలంగా ఉంటుందని.. మహాకూటమి వస్తే బలహీనం అయిపోతుందని మోడీ తనంతటతానుగా నిర్ధారించేసుకుని ప్రకటనలు చేస్తున్నారు. మోదీ మీద విరోధంతో దేశాన్ని దెబ్బతీయాలనుకుంటున్నారా? మహాకూటమిని దేశద్రోహ కూటమిగా తేల్చారు.
ప్రజల జీవితాల్లో, దేశ ఆర్థిక వ్యవస్థలో మార్పులు తెస్తున్నామని, రాజకీయ దళారులు, అవకాశ వాదులు కూటమి పేరుతో ఏకమవుతున్నారని ఆరోపించారు. అవకాశవాదంతో ఏకమై కూటమి కట్టి…కేంద్రంలో బలహీన ప్రభుత్వం ఏర్పాటు చేయాలనుకుంటున్నారని ఆరోపించారు. అలా ఎప్పటికీ జరగదు…దేశంలో మళ్లీ బీజేపీ ప్రభుత్వమే ఏర్పాటవుతుందని విశ్వాసం వ్యక్తం చేశారు. ప్రధాని కిసాన్ సమ్మాన్ యోజన పథకం కింద రైతులకు ప్రతి నాలుగు నెలలకోసారి రూ.2 వేలు ఆర్థికసాయం అందిస్తున్నామని, ఏపీలో కూడా లక్షలాది మంది రైతులు ప్రయోజనం పొందుతున్నారన్నారు. ప్రతి సన్న, చిన్నకారు రైతులు ఇప్పుడు వ్యవసాయం సంతోషంగా చేయగలుగుతున్నారని సంతోషం వ్యక్తం చేసారు. దేశ చరిత్రలోనే తొలిసారిగా మధ్యతరగతికి ఊరటనిచ్చే ఐటీ పాలసీ తెచ్చామని.. రూ.5 లక్షల లోపు ఆదాయం ఉండే వాళ్లకి పన్ను లేకుండా చేశామన్నారు. కష్టపడి సంపాదించే వాళ్లు ప్రయోజనం పొందేలా ప్రతి రూపాయి వారికే దక్కేలా మా ప్రభుత్వం పనిచేస్తోందన్నారు. తెలుగులో ప్రసంగం మొదలు పెట్టి విశాఖ వాసుల్ని పొగిడి, తెలుగుదేశం ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. దురుద్దేశాలతో రాజకీయాలు చేసేవాళ్లే భయపడతారని, ఏపీ కోసం మోదీ ఏం ఇస్తానని చెప్పారో అవన్నీ ఇచ్చారు అని ఒప్పుకుంటే.. వారికి రాజకీయంగా పుట్టగతులుండవని చెప్పుకున్నారు. అందుకే బీజేపీపై ఆరోపణలు చేస్తున్నారని ఆరోపించారు. ఆత్మగౌరవం పేరుతో ప్రజలను రెచ్చగొడుతున్నారు, వారి ఆటలు సాగనివ్వబోమని హెచ్చరించారు. గుంటూరు సభలోలా.. చంద్రబాబును..నరేంద్రమోడీ వ్యక్తిగతంగా విమర్శించలేదు. ఈ సభలో అదొక్కటే తేడా..!
దేశభక్తి విషయంలో నరేంద్రమోడీ చేసిన వ్యాఖ్యలను చంద్రబాబు తిప్పికొట్టారు. సరిహద్దుల్లో ఉద్రిక్తతలు.. అభినందన్ విజయవంతంగా పాకిస్థాన్ చెర నుంచి బయటకు వస్తూంటే ప్రధాని మోడీ మాత్రం అవేమీ పట్టించుకోకుండా ఎన్నికల ప్రచార సభల్లో పాల్గొంటున్నారని ఇదేమీ దేశభక్తి అని చంద్రబాబు ప్రశ్నించారు. పాకిస్థాన్ పార్లమెంట్లో చర్చించింది.. యడ్యూరప్ప చేసిన వ్యాఖ్యల గురించేనని.. చంద్రబాబు గుర్తు చేశారు. యుద్ధం వస్తుందని పవన్ కల్యాణ్‌కు రెండేళ్ల కిందటే చెప్పారంటే ఎవరు దేశభక్తులో అర్థం అవుతుందని ఎద్దేవా చేసారు. అభినందన్ దేశానికి తిరిగొచ్చారని మనమంతా ఆనందంగా ఉంటే, మోదీ విశాఖకు వచ్చి నల్లజెండాలతో స్వాగతం తీసుకున్నారని విమర్శించారు. వీరజవాన్ల కుటుంబాలకు రూ.30 కోట్ల విరాళం ఇచ్చిన ఏకైక రాష్ట్రం మనదేనని చంద్రబాబు గుర్తు చేసారు. ఢిల్లీలో ఉండి దేశానికి స్ఫూర్తినివ్వాల్సిన మోదీ రాజకీయ సభలు పెట్టుకుంటూ తిరుగుతున్నారన్నారు. రాజకీయాలను దేశభద్రతతో ముడిపెట్టవద్దని చంద్రబాబు హెచ్చరించారు. ఎన్నికల కోసం దేశభద్రతను పట్టించుకోపోవడం మంచిదికాదన్నారు.