ఎన్డీయే రాష్ట్రపతి అభ్యర్థి రామ్ నాథ్ కోవింద్ హైదరాబాద్ వచ్చారు. ఇక, తెలుగు రాష్ట్రాల పార్టీల హడావుడి మామూలుగా లేదు. ఫ్లెక్సీలూ సత్కారాలూ అంటూ తెలంగాణ సీఎం కేసీఆర్, భాజపాపై ఉన్న భక్తిని చాటుకునే ప్రయత్నం చేశారు. ఇదో ఆశ్చర్యమైతే.. ఇంతకుమించిన మరో ఆశ్చర్యం.. ఏపీ ప్రతిపక్ష నేత జగన్మోహన్ రెడ్డి తీరు! ఎన్డీయే అభ్యర్థి కోవింద్ కు జగన్ పాదాభివందనం చేయడం అందర్నీ ఆశ్చర్యానికి గురి చేసింది. ఆయనే అనుకుంటే.. ఆయన వెనకనే వచ్చిన విజయసాయి రెడ్డి కూడా అదే పనిచేశారు. దీంతో చుట్టూ ఉన్న వైకాపా నేతలంతా ఆశ్చర్యానికి గురయ్యారు. జగన్ మారిపోయారా..? లేదా, మారాల్సి వచ్చిందా..? ఈ ప్రవర్తనను ఎలా అర్థం చేసుకోవాలనే చర్చ మొదలైంది.
భాజపా అంటే ఎప్పట్నుంచో భయమో, కొత్తగా కలిగిన భక్తో, సహజంగా పెరిగిన ఇష్టమో.. కారణం ఏదో తెలీదుగానీ, కమలనాథులకు దగ్గరయ్యేందుకు జగన్ ఈ మధ్య తెగ ఆరాటపడిపోతున్నారు. రాష్ట్రపతి ఎన్నికకు ముందే ఆయన ఢిల్లీ వెళ్లి ప్రధానిని కలిశారు. ఆ మీటింగ్ పై టీడీపీ ఎన్నో విమర్శలు చేసింది. రాష్ట్రపతి అభ్యర్థి విషయంలో కూడా బేషరతుగా భాజపాకి మద్దతు ప్రకటించారు. ఇంతకీ.. వైకాపా మద్దతు ప్రకటన వెనక బలమైన కారణం ఏంటనేది పెద్ద ప్రశ్న..? జగన్ ఎన్డీయేలో భాగస్వామి పక్ష నాయకుడు కూడా కాదు. ఇంకోపక్క భాజపా టీడీపీలు పొత్తులో ఉన్నాయి. అలాంటప్పుడు భాజపాకి ఈ రేంజిలో మద్దతు ఇవ్వాల్సిన అవసరం వైకాపాకి ఏమొచ్చింది..? వ్యక్తిగత, రాజకీయ కారణాలు తప్ప… ఎన్డీయే అభ్యర్థికి జగన్ ఈ స్థాయిలో మద్దతు ఇవ్వడం వెనక వేరే ప్రజాప్రయోజనాలేవీ కనిపించడం లేదన్నది విశ్లేషకుల వ్యాఖ్య.
ఇక, కోవింద్ కు జగన్ పాదాభివందనం చేయాల్సినంత అవసరం ఏమొచ్చిందనే విషయానికి వద్దాం. సరే, ఆయన వయసులో పెద్దాయన కాబట్టి, ఆశీస్సుల కోసం జగన్ అలా చేశారు అనుకున్నా… గతంలో ఇలాంటి ఘటన ఒక్కటీ లేదు కదా! జగన్ సహజ ధోరణి ఇలా ఎప్పుడూ కనిపించలేదు. గతంలో ఇలా చేసిన సందర్భాలు ఉంటే, ఇది ప్రత్యేకంగా కనిపించేది కాదు. కేవలం మద్దతు ప్రకటించుకునే క్రమంలోనే అయితే.. ఇది అనవసర చర్యగానే చెప్పాలి. పోనీ.. జగన్ ఒక్కరే అనుకుంటే, వెనక విజయసాయిరెడ్డి కూడా అదే పనిచేశారు!
వైకాపా పాయింటాఫ్ వ్యూ నుంచి ఆలోచిస్తే.. జగన్ మారారు అనే సంకేతాలు ఇచ్చారని చెప్పుకోవాలి. రాజకీయాల్లో పట్టు విడుపు ధోరణుల అవసరాన్ని జగన్ గుర్తించారనీ, రాజకీయాల్లో ఎత్తులు పైఎత్తులు మాత్రమే ఉంటాయనే అవసరాన్ని ఆయన గుర్తించారని వారు చెప్పుకోవచ్చు. రాజకీయాల్లో అవసరమైన లౌక్యాన్ని కూడా జగన్ బాగానే నేర్చుకున్నారని ఈ ఘటన ద్వారా వైకాపా శ్రేణులు చెప్పుకుంటాయి.
ఇక, టీడీపీ పాయింటాఫ్ వ్యూ నుంచి చెప్పాలంటే… మోడీ దగ్గర నాలుగు మంచి మాటలు చెప్తారన్న ఆశతోనే జగన్ ఆయనకు పాదాభివందనం చేశారన్నది ఆ పార్టీ ఎద్దేవా! కేసుల మాఫీ కోసం ఎవ్వరి కాళ్లైనా పట్టుకోవడానికి జగన్ రెడీ అనీ, ఆ మధ్య ఢిల్లీ వెళ్లి అదే పని చేశారనీ, ఇప్పుడు రాష్ట్రపతి అభ్యర్థి కోవింద్ ముందు కూడా తన సహజ ధోరణిని ప్రదర్శించారని వారు విమర్శలు గుప్పిస్తారు. ఇంతకీ… జగన్ లౌక్యాన్ని ఒంటపట్టించుకునే క్రమంలో ఉన్నట్టా..? లేదంటే, భాజపా అండ లేకపోతే మనగలడం కష్టమని భావించినట్టా..? భాజపాను తనవైపు తిప్పుకున్నానని ఇతర పార్టీలకు గర్వంగా తాను చెబుతున్నట్టా..?