ఇదేనా మీరు చెప్పిన మార్పు అని బీఆర్ఎస్ నేతలు ఫేక్ న్యూస్ తో ప్రభుత్వాన్ని నిలదీస్తూ వస్తున్నారు కానీ.. కళ్ల ముందు కొన్ని వ్యవస్థలు చురుకుగా కదులుతున్న మార్పు మాత్రం ప్రజల్లో కనిపిస్తోంది. ప్రజల ఆరోగ్యాన్ని హరిస్తున్న హోటళ్ల బరి తెగింపు ను ఫుడ్ సేఫ్టీ అధికారులు బయట పెట్టారు. గతంలోలా ఉండదని.. జాగ్రత్తలు తీసుకుని ప్రజారోగ్యాన్ని కాపాడకపోతే పరిణామాలు ఊహించలేరని హెచ్చరికలు పంపారు. దీంతో ఇప్పుడు హోటళ్లన్నీ నిర్లక్ష్యాన్ని వదిలి జాగ్రత్తలు తీసుకుంటున్నాయి.
తెలంగాణలో మెడికల్ మాఫియా ఏ స్థాయిలో ఉంటుందో చెప్పలేం. నకిలీ డాక్టర్లు పెరిగిపోయారు. ఈ మెడికల్ మాఫియాపై గత పదేళ్లలో ఎప్పుడైనా చిన్న చర్యలు తీసుకున్న సందర్భాలు లేవు. కానీ ఇప్పుడు మెడికల్ షాపులలో నకిలీ మందులు అమ్మినా వదలడం లేదు. అర్హత లేకపోయినా వైద్యం చేస్తున్న నకిలీ వైద్యులను కూడా వదిలి పెట్టడం లేదు. ఈ దాడులు ఇప్పుడు తెలంగాణ వ్యాప్తంగా జరుగుతున్నాయి. మరో వైపు ప్రజల ను పట్టి పీడిస్తున్న ప్రభుత్వ కార్యాలయాల్లో అవినీతిపై ఏసీబీ యాక్టివ్ అయింది.
పౌరసేవల విషయంలో ప్రభుత్వం చాలా కేర్ తీసుకుంటోంది. నిర్లక్ష్యాన్ని ఏ మాత్రం అంగీకరించడం లేదు. ఓ మున్సిపాలిటీలో దోమలు ఎక్కువగా ఉన్నాయని వెబ్ సైట్ ద్వారా ఫిర్యాదు చేస్తే ఆ మున్సిపాలిటీ వెంటనే ఓ వ్యక్తిని ఫాగింగ్ కోసం కేటాయించి ఆ సమాచారాన్ని ఫిర్యాదుదారునికి పంపింది. అన్ని చోట్లా ఇలా యంత్రాగాన్ని కదిలించే ప్రయత్నం జరుగుతోంది. విద్యుత్ సిబ్బందిలో నిర్లక్ష్యం కారణంగా కొన్ని చోట్ల సమస్యలు వస్తున్నాయి. వారిలో ఉన్న నిర్లక్ష్యాన్ని వదిలించేందుకు గట్టి ప్రయత్నాలు చేశారు. ఇప్పుడు పరిస్థితి మెరుగుపడుతోంది.
రాజకీయంగా ఏం జరుగుతున్నా.. .ప్రభుత్వ యంత్రాంగాన్ని మాత్రం ప్రజాసేవకు.. మళ్లించి వారి విధుల్ని వారు సీరియస్ గాచేసే విషయంలో మార్పు కనిపిస్తోందని అనుకోవచ్చు.