ఏపీ సరిహద్దుల్లో మళ్లీ తెలంగాణ చెక్ పోస్టులు పెట్టింది. గతంలో అంబులెన్స్‌లు … బస్సులు లాంటివి రాకుండా చెక్ పోస్టులు ఏర్పాటు చేశారు. ఈ సారి మాత్రం ధాన్యం వాహనాలు రాకుండా ఈ చెక్ పోస్టులు ఏర్పాటు చేశారు. తెలంగాణ రైతుల నుంచి ధాన్యం కొనుగోలు చేయాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. ఏపీ నుంచి కూడా రైతులు, వ్యాపారులు ధాన్యం తెస్తారేమోనని భావించి..అలాంటివేమీ తెలంగాణలోకి రాకుండా జాగ్రత్తలు తీసుకుంది. అందుకే ఏపీ నుంచి తెలంగాణలోకి వచ్చే అన్ని దారుల్లోనూ చెక్ పోస్టులు ఏర్పాటు చేసింది.
ఇప్పటికే చెక్ పోస్టులు పని చేయడం ప్రారంభించాయి. తెలంగాణలోకి వస్తున్న ధాన్యాన్ని వెనక్కి పంపుతున్నారు. నిజానికిచాలా మంది ఏపీ రైతులు ప్రభుత్వానికి అమ్మాలని లేకపోయినా మిల్లర్లకు అమ్ముతూ ఉంటారు. ఇప్పుడు తెలంగాణ మిల్లర్లు కూడా తెలంగాణ రైతుల వద్ద నుంచే ధాన్యం తీసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. మిర్యాలగూడ వంటి ప్రాంతాలు రైస్ మిల్లులకు ప్రసిద్ధి. అక్కడకు ఏపీ నుంచి పెద్ద ఎత్తున ధాన్యం తరలిస్తూ ఉంటారు. ఈ సారి అలాంటి అవకాశం లే్కుండాపోతోంది. సరిహద్దుల నుంచే వెనక్కి తరలిస్తున్నారు.
తెలంగాణ ప్రభుత్వం రైతుల వద్ద నుంచి వడ్ల కొని.. మిల్లర్లకు ఇస్తుంది. మిల్లర్లు బియ్యాన్ని ఎఫ్‌సీఐకి ఇస్తారు. ఇప్పుడు ఏపీ ధాన్యం కూడా జత కలిస్తే.. మిల్లర్లు తెలంగాణ రైతుల ఖాతాలో వేసే అవకాశం ఉంది. కారణం ఏదైనా… ఇప్పుడు మరోసారి ఏపీ, తెలంగాణ మధ్య చెక్ పోస్టులు పడ్డాయి. ధాన్యం రైతులు వీసా తీసుకుంటేనే తెలంగాణలో కి ఎంటరవుతారు. ఆ వీసా అంత సులువుగా లభించదు మరి !