ఈ ఐపీఎల్ లో చెన్నై ఆట తీరు ఏమాత్రం ఆశాజనకంగా సాగలేదు. వరుస ఓటములతో… అభిమానుల్ని నిరాశ పరిచింది. అయితే.. చివరి మ్యాచ్‌లలో మాత్రం గెలిచి ఊరడింపు విజయాల్ని అందుకుంది. అంతేకాదు. మిగిలిన జట్ల ప్లే ఆఫ్ అవకాశాలకు గండి కొడుతూ వచ్చింది. ఇప్పుడు పంజాబ్ కి ఇంటికి పంపింది. ఈరోజు పంజాబ్ తో జరిగిన మ్యాచ్‌లో చెన్నై 9 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ ఓటమితో.. పంజాబ్ ప్లై ఆఫ్ దారులు పూర్తిగా మూసుకుపోయాయి.
టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న చెన్నై..భీకరమైన బ్యాట్స్‌మెన్స్ జట్టుగా పేరొందిన పంజాబ్‌ని బాగా కట్టడి చేయగలిగింది. 20 ఓవర్లలో 153 పరుగులు మాత్రమే చేయగలిగింది. అనంతరం బ్యాటింగ్ కి దిగిన చెన్నై ఆడుతూ పాడుతూ విజయ లక్ష్యాన్ని అందుకుంది. గైడ్వాడ్ మరోసారి ఆకట్టుకున్నాడు. 49 బంతుల్లో 66 పరుగులు చేసి నాటౌట్ గా నిలిచాడు. చెన్నైని ఒంటి చేత్తో గెలిపించాడు.డూప్లెసీస్ కూడా (48) రాణించడంతో చెన్నై గెలుపు నల్లేరు పై నడకలా మారింది. ఈ ఓటమితో.. పంజాబ్ ప్లే ఆఫ్‌కి దూరమైంది. ఇప్పటికే ముంబై ప్లే ఆఫ్ కి చేరుకుంది. మిగిలిన మూడు స్థానాల కోసం హైదరాబాద్, బెంగళూరు, ఢిల్లీ, రాజస్థాన్, కొలకొత్తా జట్ల మధ్య పోటీ నెలకొంది.