పాదయాత్ర సందర్భంగా ఆరు నెలలపాటు వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపు కావాలంటే సీబీఐ కోర్టును ఏపీ ప్రతిపక్ష నేత జగన్ ఆశ్రయించిన సంగతి తెలిసిందే. ప్రజలు సమస్యలు తెలుసుకునేందుకు తాను జనంలోకి వెళ్తున్నాననీ, పాదయాత్ర జరుగుతున్న సమయంలో విచారణ నుంచి వెసులుబాటు కల్పించాలని జగన్ చేసుకున్న అభ్యర్థనను సీబీఐ కోర్టు తోసిపుచ్చింది. దీనిపై హైకోర్టుకు వెళ్లే ఆలోచనలో జగన్ ఉన్నారని తెలుస్తోంది. దీంతో అధికార పార్టీ తెలుగుదేశానికి మరో బలమైన విమర్శనాస్త్రం దొరికేసింది. ఆయన పాదయాత్రకు ప్రతీ శుక్రవారం సెలవు పెట్టుకోవాల్సి వస్తుందని తాము ముందే చెప్పామంటూ టీడీపీ నేతలు వ్యాఖ్యానాలు మొదలుపెట్టేశారు. ఇప్పటికైనా ఆయన ప్రతిపక్ష నేత హోదా నుంచి తప్పుకోవాలనీ, పార్టీ పగ్గాలను ఇతర నాయకులకు ఇచ్చేయాలంటూ ఏపీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి విమర్శించారు. డజను కేసుల్లో ఎక్యూజ్డ్ వన్ గా ఉన్న నాయకుడు ప్రజల కోసం ఏం చేయగలరు అంటూ ఆయన ఎద్దేవా చేశారు. అయితే, ఇదే సందర్భాన్ని ఉద్దేశించి ఉప ముఖ్యమంత్రి చినరాజప్ప కూడా స్పందించారు. ఆయన మాటలే కాస్త ఆసక్తికరంగా ఉన్నాయి!
‘నంద్యాల, కాకినాడ ఎలక్షన్ల తరువాత ఆ పార్టీ నాయకులంతా జారిపోయే పరిస్థితి వచ్చింది. కాబట్టి, పాదయాత్ర చేసి నేతల్ని పోగేద్దామని చెప్పి ప్రయత్నించారు. కానీ, శుక్రవారం నాడు కోర్టు అడ్డు వచ్చింది. దాని తప్పించుకోవడం కోసమే కోర్టుకు వెళ్తే.. నువ్వు పాదయాత్రలు చేయాల్సిన అవసరం లేదూ, కోర్టు అటెండ్ కావాల్సిందే అని చెప్పింది’ అంటూ చినరాజప్ప వ్యాఖ్యానించారు. పాదయాత్రకు ప్రతీ శుక్రవారం సెలవు ఉంటాదని తాము కూడా గతంలో చెప్పామన్నారు. జగన్ పాదయాత్ర చేసినా చేయకపోయినా.. ఏపీ ప్రజలే కాదు, వైకాపా నాయకులు కూడా ఆయన్ని నమ్మే పరిస్థితి లేదన్నారు. నాయకులంతా జారుకునే స్థితిలో ఉన్నారని రాజప్ప జోస్యం చెప్పారు. ఇప్పటికైనా ఆయన కళ్లు తెరవాలనీ, రాష్ట్ర అభివృద్ధిని అడ్డుకునే ప్రయత్నాలు మానుకుని సహకరించాలని స్పష్టం చేశారు.
వైకాపా నుంచి పెద్ద ఎత్తున వలసలకు రాజప్ప మరోసారి పరోక్షంగా ఆహ్వానం పలుకుతున్నట్టుగా ఉంది! ఎలాగూ జగన్ పాదయాత్ర సందర్భంగా కొన్ని వలసల్ని ముందే ప్లాన్ చేసి పెట్టుకున్నారు. ఎంపీ బుట్టా రేణుక, అనంతపురానికి చెందిన కొద్దిమంది నేతలూ.. వీరంతా పచ్చ కండువా కోసం లైన్లో ఉన్నవారే కదా. ఇప్పుడు కోర్టు తీర్పు కూడా జగన్ కి ప్రతికూలంగా ఉండేసరికి… ఈ పరిస్థితిని మరింత అనుకూలంగా మార్చుకునేందుకు టీడీపీ సిద్ధమౌతున్నట్టుగా రాజప్ప వ్యాఖ్యల్ని బట్టీ చెప్పొచ్చు. ఇప్పటికే వైకాపాలోని ప్రముఖుల్ని టీడీపీలోకి చేర్చుకున్నారు. ఇక మిగిలిన నేతలు, ఎటూ తేల్చుకోలేక ఊగిసలాడే నాయకులకు టీడీపీ మరింత విశాలంగా ద్వారాలు తెరిచి పెట్టిందనే సంకేతాలు పంపుతున్నట్టుగా ఉంది!