‘బింబిసార’తో ఆకట్టుకొన్నాడు వశిష్ట. తొలి సినిమాతోనే సూపర్ హిట్టు కొట్టాడు. తనపై అగ్ర హీరోల కన్ను పడడం సహజం. దానికి తగ్గట్టుగానే చిరంజీవితో సినిమా ఓకే చేయించుకొన్నాడు. ప్రస్తుతం స్క్రిప్టు పనులు జరుగుతున్నాయి. ఇదో సోషియో ఫాంటసీ కథ. ‘జగదేక వీరుడు- అతిలోక సుందరి’ టైపులో నడుస్తుంది. జగదేక వీరుడులో స్వర్గం నుంచి.. శ్రీదేవి దిగి వస్తుంది. ఇక్కడ కూడా అలాంటి సెటప్పే ఉందని టాక్. కాకపోతే.. స్వర్గం నుంచే కాదు.. ముల్లోకాల నుంచీ.. హీరో కోసం కథానాయికలు భూమ్మీదకు దిగుతారని సమాచారం. అందుకే ఈ సినిమాకి ‘ముల్లోక వీరుడు’ అనే పేరు పెట్టాలని ఫిక్సయినట్టు తెలుస్తోంది. ప్రస్తుతానికి ఇది వర్కింగ్ టైటిల్. పోస్టర్ పై కూడా ఇదే ఫిక్సయ్యే అవకాశాలు ఉన్నాయి. ఈ టైటిల్ విషయంలో చిరు తుది నిర్ణయం తీసుకోవాల్సివుంది. ఈ సినిమాలో 8 మంది కథానాయికలకు చోటుంది. అంతమంది హీరోయిన్లని ఒకే సినిమాలో, అందులోనూ చిరు సినిమాలో చూడడం కనులకు పండగే. వశిష్ట సినిమాతో పాటుగా.. కల్యాణ్ కృష్ణ సినిమాకీ చిరు పచ్చ జెండా ఊపిన సంగతి తెలిసిందే. ఈ రెండు చిత్రాల్నీ ఒకేసారి పట్టాలెక్కించాలని చిరు భావిస్తున్నాడు. ఆగస్టు 11న `భోళా శంకర్` విడుదల అవుతుంది. ఆ తరవాతే.. ఈ రెండు సినిమాలూ శ్రీకారం చుట్టుకొంటాయి.