ఈ సంక్రాంతికి చిరంజీవి, బాలకృష్ణ బాక్సాఫీసు దగ్గర `నువ్వా? నేనా?` అంటూ తలపడబోతున్నారు. వీరిద్దరి సినిమాలూ ఒక రోజు వ్యవధిలో విడుదల కాబోతున్న సంగతి తెలిసిందే. ఈ రెండు చిత్రాల్నీ మైత్రీ మూవీస్ సంస్థ నిర్మించింది. వాల్తేరు వీరయ్య ప్రెస్ మీట్ లో `ఈ సంక్రాంతికి ఈ రెండు సినిమాలూ హిట్ అవుతాయి..` అంటూ చిరు కూడా బాలయ్య సినిమాకి ఆల్ ది బెస్ట్ చెప్పారు. ఇప్పుడు చిరు, బాలయ్య కలిసి ఒకే ఫ్రేమ్‌లోకి రాబోతున్నట్టు సమాచారం. చిరు, బాలయ్య మధ్య చక్కటి సఖ్యత ఉంది. ఇద్దరూ మంచి స్నేహితులు. `ఇండస్ట్రీలో నేను క్లోజ్ గా ఉండేది ఒక్క చిరంజీవితోనే` అంటూ ఓసారి బాలయ్య కూడా చిరుపై తనకున్న ప్రేమని వ్యక్తం చేశారు. సంక్రాంతికి ఈ హీరోలిద్దరి సినిమాలూ రాబోతున్నాయి కాబట్టి.. ఈ ఇద్దరు హీరోల్నీ కలిపి ఓ ఇంటర్వ్యూ చేస్తే ఎలా ఉంటుందన్న ఆలోచనలో మైత్రీ మూవీస్ సంస్థ ఉన్నట్టు తెలుస్తోంది. విడుదలకు ముందు… వాల్తేరు వీరయ్య, వీర సింహారెడ్డి ప్రమోషన్ ని ఒకే వేదికపై నిర్వహిస్తే బాగుంటుందన్న ఆలోచన కూడా ఉంది. అయితే దీనికి చిరు, బాలయ్యల అంగీకారం కావాలి. తమ సినిమాలు ఒకేసారి విడుదల అవుతున్న వేళ.. చిరు, బాలయ్యలు కలిసి ఒకే ఇంటర్వ్యూలో కనిపిస్తే.. నిజంగా అది ఓ మంచి సంప్రదాయానికి తెర తీసినట్టు అవుతుంది. అభిమానుల మధ్య కూడా నీ హీరో గొప్పా? నా హీరో గొప్పా? అనే గొడవలూ ఉండవు.