చిరంజీవి తన 151వ చిత్రం ‘ఉయ్యాల వాడ నరసింహారెడ్డి’ ప్రీ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉన్నాడు. ఖైదీ నెం.150 కీ.. 151వ సినిమాకీ చాలా గ్యాప్ వచ్చేసినట్టైంది. అయితే తన తదుపరి సినిమా విషయంలో ఇంత గ్యాప్ తీసుకోవడానికి చిరు ఇష్టపడడం లేదు. అందుకే.. 152 కోసం అప్పుడే సన్నాహాలు మొదలెట్టేశాడు. అందులో భాగంగా బోయపాటి శ్రీనుకి చిరు ఫోన్ చేసినట్టు సమాచారం. ”కథ రెడీగా ఉంచు…. ఎనీటైమ్ సెట్స్‌పైకి వెళ్లొచ్చు” అని బోయపాటికి హింట్ ఇచ్చాడట.
తన 152వ సినిమాకి బోయపాటి దర్శకుడనే విషయంలో చిరు ఓ క్లారిటీకి వచ్చేశాడు. గీతా ఆర్ట్స్ సంస్థ ఈ చిత్రాన్ని తెరకెక్కించనుంది. బోయపాటి దగ్గర చిరుకి తగిన కథలు రెండు సిద్ధంగా ఉన్నాయి. అయితే వాటి స్క్రిప్టు పనులు ఇంకా మొదలు కాలేదు. ఈ రెండు కథల్లో ఒకదానికి చిరు ఓకే చెబితే.. స్క్రిప్టు పనులు మొదలెట్టొచ్చు. త్వరలోనే చిరు – బోయపాటి మధ్య భేటీ జరిగే అవకాశం ఉంది. ప్రస్తుతం బోయపాటి ‘జయ జానకి నాయక’ సినిమాతో బిజీగా ఉన్నాడు. చిరు 152వ సినిమా మొదలవ్వడానికి ఎంత కాదన్నా 8 నెలల సమయం పడుతుంది. ఈలోగా చిరు స్క్రిప్టుతో గడపాలా? లేదంటే మరో సినిమా మొదలెట్టాలా?? అనే విషయంలో ఏదీ తేల్చుకోలేకపోతున్నాడు బోయపాటి. మరోవైపు నందమూరి బాలకృష్ణ, అఖిల్‌లతోనూ బోయపాటి సినిమాలు చేసే అవకాశం ఉందని ప్రచారం సాగుతోంది. మరి బోయపాటి మొగ్గు ఎటువైపు ఉందో చూడాలి.