హైదరాబాద్: రాజమండ్రి పుష్కర దుర్ఘటనకు బాధ్యత వహించి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు రాజీనామా చేయాలని కాంగ్రెస్ ఎంపీ చిరంజీవి డిమాండ్ చేశారు. హైదరాబాద్లో గాంధీభవన్లో పీసీసీ అధ్యక్షుడు రఘువీరారెడ్డితోకలిసి ఆయన మీడియాతో మాట్లాడారు. ఇది ప్రభుత్వం చేతగానితనానికి నిదర్శనమని అన్నారు. ఏర్పాట్లలో వైఫల్యంవలనే దుర్ఘటన జరిగిందని ఆరోపించారు. పుష్కరాలపై చంద్రబాబునాయుడు ఆరు నెలలనుంచి సమీక్షలు, సమావేశాలతో హడావుడి చేశారని, అంతా తానే భుజాన వేసుకుని చేస్తున్నట్లు చెప్పుకొచ్చారని ఆరోపించారు. రు.1600 కోట్లు ఖర్చుపెట్టి ఏమి చేశారని ప్రశ్నించారు. పబ్లిసిటీకోసం తహతహ తప్ప చేసిందేమీలేదని మండిపడ్డారు. తాము రాజీనామాకు డిమాండ్ చేసినా వృథా ప్రయాసతప్ప ఉపయోగంలేదని అన్నారు. గత కృష్ణా పుష్కరాల సందర్భంగా ఒకరో, ఇద్దరో మరణిస్తే నాటి ముఖ్యమంత్రి వైఎస్ రాజీనామా చేయాలని చంద్రబాబు నాడు యాగీ చేశారని, ఇప్పుడు అది ఈయనకు వర్తించదా అని ప్రశ్నించారు. ఈ దుర్ఘటనకు చంద్రబాబు బాధ్యత వహిస్తారా, లేదా అని అడిగారు.