మెగా హీరోతో ఎవరైనా ఓ హిట్టు అందుకొంటే, ఆ కాంపౌండ్‌లోని మిగిలిన హీరోలతో పనిచేయడానికి… మార్గం సుగమం అయినట్టే. చరణ్‌తో హిట్టుకొట్టినా, బన్నీతో హిట్ కొట్టినా… చిరంజీవితో సినిమా చేయడానికి రాచమార్గం దొరికేసినట్టే. ప్రస్తుతం ఇలాంటి ఊహల పల్లకిలోనే ఊరేగుతున్నాడు డీజే డైరెక్టర్ హరీష్ శంకర్. డీజే వసూళ్లు హరీష్ కి కొత్త ఉత్సాహాన్ని ఇస్తున్నాయి. డివైడ్ టాక్ వచ్చినా, వసూళ్లు చూసి ముచ్చటపడిపోతున్నాడు. కనీసంలో కనీసం ‘రామయ్యా వస్తావయ్యా’ లాంటి సినిమా అయితే కాదుగా.. అన్న సంతృప్తి అయితే – కావల్సినంత మిగిలింది.
మెగా ఫ్యామిలీకి హరీష్ శంకర్ వీరాభిమాని. పవన్ కల్యాణ్. సాయిధరమ్ తేజ్‌లతో కలసి పనిచేస్తున్నప్పడే చిరంజీవిపై దృష్టి పెట్టాడు హరీష్. అయితే ఆ సమయంలో చిరు మూడ్ సినిమాలకు దూరంగా, రాజకీయాలకు దగ్గరగా సాగడంతో తన కోరికను వెలుబుచ్చే అవకాశం రాలేదు. ఇప్పుడు మాత్రం లైన్ క్లియర్ అయిపోయింది. చిరు దృష్టి సినిమాలపై మాత్రమే ఉంది. అందుకే… చిరుతో పనిచేయడానికి తహతహలాడిపోతున్నాడు హరీష్. అందుకే డీజే ప్రమోషన్లలో చిరుని ఆకాశానికి ఎత్తేశాడు. చిరు కోసం ఓ మంచి ఎంటర్టైనర్ సిద్ధంగా ఉందని, అది గ్యాంగ్ లీడర్, ఘరానా మొగుడు స్థాయిలో ఉంటుందని, ఆ సినిమా మొదలైతే.. అదే టాక్ ఆఫ్ ది టౌన్ అవుతుందని వీర లెవిల్లో సెలవిచ్చాడు. డీజే వసూళ్లు సంతృప్తి కరంగా ఉండడం హరీష్ కి కలిసొచ్చే విషయమే. బన్నీ సినిమా కాబట్టి..చిరు తప్పకుండా చూస్తాడు. పనిలో్ పనిగా చిరుతో ఓ ప్రెస్ మీట్ పెట్టించడం ఖాయం. ఆ సందర్భంగా చిరు నోటి నుంచి ‘హరీష్ తో సినిమా చేయాలలని వుంది’ అంటూ ఓ సినిమా టిక్ డైలాగ్ అయితే చెప్పించడం మహా తేలిక. ఇవన్నీ జరక్కపోయినా… మెగా హీరోలిద్దరికి హిట్లు ఇచ్చాడు కాబట్టి చిరు దృష్టి హరీష్‌పై ఉండడం ఖాయం.
డీజే వసూళ్లు చూసి మీడియా కూడా ‘చిరు – హరీష్’ల సినిమా ఖాయమైపోయినట్టే అంటూ ఊహాగానాల్ని బాగానే ప్రచారం చేస్తోంది. అయితే… ఈ కాంబో అనుకొన్నంత తేలిక కాదు. ఎందుకంటే చిరు 151వ సినిమానే ఇంకా మొదలవ్వలేదు. ఆ తరవాత బోయపాటితో సినిమా ఉంటుంది. అంటే హరీష్ కనీసం రెండేళ్లయినా వేచి చూడాలి. ఈలోగా రాజెవరో, మంత్రెవరో తెలీదు. అంతకంటే ముఖ్యంగా కథల ఎంపికపై చిరు దృష్టి మారింది. చిరు ఇప్పుడు ఎంటర్టైన్మెంట్ కథల్ని ఓకే చేయడం లేదు. చిరు అదే కోరుకొంటే ‘ఆటోజానీ’ సినిమా ఎప్పుడో పట్టాలెక్కేసేది. సామాజిక చైతన్యం ఉన్న ‘కత్తి’లాంటి సినిమా ఎంచుకొన్నాడంటే. ‘ఉయ్యాల వాడ నరసింహారెడ్డి’ కథని తన 151వ చిత్రంగా పట్టాలెక్కిస్తున్నాడంటే కథల ఎంపికలో చిరు దృక్పథం ఎంతలా మారిందో అర్థం చేసుకోవొచ్చు. ఆ స్థాయి కథ… హరీష్ నుంచి ఆశించడం అత్యాసే అవుతుంది. సో.. చిరు – హరీష్ కాంబో ఇలాంటి గాసిప్పులకే పరిమితం అయ్యే ఛాన్సులే ఎక్కువగా కనిపిస్తున్నాయి. నిజంగా జరిగితే.. అదో అద్భుతం అనుకోవాలంతే.