ఇండస్ట్రీలో పేరున్న దర్శకులు ఓ 30 మంది ఉంటే.. అందులో సగం మంది చిరంజీవితో సినిమా చేస్తున్నమన్న ఊహల్లో ఊరేగుతున్నారు. మారుతి, మోహన్ రాజా, హరీష్ శంకర్, అనుదీప్, పూరి, తమిళ హరి…. ఇలా ఈ లిస్టు చాంతాడంత ఉంది. ప్రతీ ఒక్కరూ చిరుతో టచ్‌లోనే ఉన్నారు. చిరు కూడా ‘మీతో సినిమా చేస్తా.. కథ రెడీ చేస్కోండి’ అంటూ అందరికీ మాట ఇచ్చుకొంటూ వెళ్లిపోతున్నారు. యువ దర్శకులందరితోనూ పని చేయాలన్న కుతూహలం, కోరిక చిరులో ఉన్నాయి. కాకపోతే వాటితో పాటే కన్ఫ్యూజన్ కూడా ఉంది. అందుకే అందరికీ మాట ఇచ్చేస్తున్నారు. ఎవరి నుంచి ఎలాంటి కథ వస్తుందో ఎవరికీ తెలీదు. సడన్ గా ఓ దర్శకుడు మంచి కథతో మెస్మరైజ్ చేయొచ్చు. అందుకే ఎందుకైనా మంచిదని చిరు ఇలా అందరికీ మాట ఇచ్చేస్తున్నారని, కథ సెట్ అయితే కానీ, తన తుది నిర్ణయం తీసుకోరని మెగా కాంపౌండ్ వర్గాలు చెబుతున్నాయి. చిరు ఇంట ప్రతీ రోజూ ఓ దర్శకుడు కథ పట్టుకొని రావడం, నేరేషన్ ఇవ్వడం, చిరుకి నచ్చకపోవడం, మళ్లీ మార్పులు చేర్పులూ చేసుకొని రమ్మనడం.. ఇదే తంతు కొనసాగుతోంది.
నిజానికి ఇంత కన్ఫ్యూజన్ చిరుకి ఎప్పుడూ లేదు. ఓ సినిమా చేస్తున్నప్పుడు చిరు ఫోకస్ కేవలం ఆ సినిమాపైనే ఉండేది. అది పూర్తయ్యాక, అప్పటి మూడ్ ని బట్టి కథని, దర్శకుడ్ని ఎంచుకొనేవారు. ఇప్పుడు మాత్రం చిరు పంథాలో స్పష్టమైన మార్పు కనిపిస్తోంది. ‘చిరుతో సినిమా చేస్తున్నా’ అనే మూడ్ లో ఇండస్ట్రీలో ఇప్పుడు పదిమంది దర్శకులు తిరుగుతున్నారు. జూన్, జులైతో ‘విశ్వంభర’ పూర్వుతుంది. మరి వెంటనే ఎవరితో సినిమా చేయాలన్న విషయంలో ఇంకా ఓ క్లారిటీకి రాలేదు చిరు. కానీ ఈ దర్శకులంతా ‘నాకే ఆ ఛాన్స్’ అంటూ మేఘాల్లో తేలిపోతున్నారు. మరి ఆ ఛాన్స్ ఎవరికి దక్కుతుందన్నదే ఇప్పుడు మిలియన్ డాలర్ల ప్రశ్న.