రాజ్యసభ సభ్యుడిగా ఉన్న చిరంజీవి రాష్ట్ర సమస్యల గురించి, రాష్ట్ర ప్రయోజనాల కోసం రాజ్యసభలో గట్టిగా మాట్లాడాలి. కానీ ఆయన రాజ్యసభకు వెళ్ళకుండా సినిమా తీసుకొంటున్నారు. అయినా కూడా రాష్ట్ర ప్రజలు ఆయన మీద అభిమానంతో ఆ విషయం గురించి ప్రశ్నించడం లేదు. ప్రజలను, రాష్ట్రాన్ని పట్టించుకోకపోతే పాయె కనీసం రాజకీయాలలో తనకు ఒక కొత్త గుర్తింపు, గౌరవం అందించిన కాంగ్రెస్ పార్టీని కూడా ఆయన పట్టించుకోవడం లేదు. కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఆయనకి కేంద్రమంత్రి పదవి కుర్చీని, ఆ తరువాత ఆయన రాజ్యసభకి వెళ్ళడని తెలిసినా అందులో ఓ కుర్చీని ఆయన కోసం కేటాయించింది. కానీ ఆయన మాత్రం ఆంద్రప్రదేశ్ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ మంచుముక్కలా కరిగిపోతున్నా కూడా పట్టించుకోకుండా తను నటించబోయే 150 సినిమా హిట్ట్ అవడానికి మాత్రం ‘అన్ని జాగ్రత్తలు’ తీసుకోవడాన్ని కాంగ్రెస్ జీవులు కూడా డైజెస్ట్ చేసుకోలేకపోతున్నాయి.
మళ్ళీ ఇవాళ్ళ ఆయన ‘రాహుల్ జీ…రాహుల్ జీ…’అంటూ వెనకాలే పరిగెత్తుకు వచ్చి ఆంద్రప్రదేశ్ రాష్ట్రం గురించి చాలా ఆవేదనపడిపోతున్నట్లుగా గొప్పగా నటించేస్తున్నారు. ప్రత్యేక హోదా కోసం అధికార తెదేపా ఎంపీలు ఏమి చేసారని అచ్చం తమ్ముడు పవన్ కళ్యాణ్ అడిగినట్లే ఆయనా అడిగారు. కానీ రాష్ట్రానికి ప్రత్యేక హోదా సాధించేందుకు తనేమి చేసారో మాత్రం చెప్పలేదు. సోనియా, రాహుల్ గాంధీలు పార్లమెంటులో ఆ ప్రశ్న అడిగారని సర్ది చెప్పుకొన్నారు. కానీ తనే ఎందుకు అడగలేకపోతున్నారో చెప్పలేదు. గత పదేళ్ళ కాంగ్రెస్ పాలనలో రైతుల ఆత్మహత్యల గురించి మాట్లాడకుండా, పదేళ్ళ క్రితం తెదేపా హయంలో జరిగిన రైతుల ఆత్మహత్యల గురించి ఆయన మాట్లాడటం మరో విచిత్రం.
ఆయన తన సినిమాలలో తన సర్వస్వం ప్రజల కోసం ధార పోసేసి కాశీకి వెళ్లిపోతుంటారు. అలాగే తన తెలివితేటలతో సమాజంలో అవినీతిని, దుర్మార్గులని అందరినీ అలవోకగా అంతం చేసేస్తుంటారు. అది చూసి వెర్రి జనాలు చాలా ఇంప్రెస్స్ అయిపోతుంటారు. కానీ నిజ జీవితంలో మాత్రం ఆయన అందుకు పూర్తి భిన్నంగా చాలా బాధ్యతారాహిత్యంగా, స్వార్ధంగా వ్యవహరించడం చూసి షాక్ అవుతుంటారు. తనను ఆదరించిన నెత్తిన పెట్టుకొన్న తెలుగు ప్రజలని, కాంగ్రెస్ పార్టీని కూడా పట్టించుకోకుండా సినిమాలు తీసుకొంటూ, అప్పుడప్పుడు తమ్ముడు పవన్ కళ్యాణ్ లాగే రాజకీయాలలో గెస్ట్ పాత్ర చేసి వెళ్లిపోతుంటారు. ఇవాళ్ళ కూడా అలాగే వచ్చి రాజకీయ గెస్ట్ రోల్ చేస్తున్నారు. ఆయన సినిమాలలో హీరోగా చేస్తుండవచ్చును. కానీ నిజ జీవితంలో కూడా ప్రజల చేత హీరో అనిపించుకొన్నప్పుడే అసలయిన గౌరవం దక్కుతుంది.
ఇది రాష్ట్ర ప్రజల కోసం, రాష్ట్ర ప్రయోజనాల కోసం, కాంగ్రెస్ పార్టీ కోసం ఆయన పోరాడవలసిన సమయం. కానీ సినిమాలు తీసుకొనే సమయం కాదు. ఒకవేళ రాజకీయాలు వద్దనుకొని పూర్తిగా సినిమాలకే అంకితమయితే ఎవరూ కూడా ఆయనని ఈ విధంగా వేలెత్తిచూపబోరు. కానీ రాజ్యసభ సభ్యుడిగా జీతభత్యాలు, సౌకర్యాలు, హోదా గుర్తింపు అన్నీ కావాలి…కాంగ్రెస్ నేతగా సమాజంలో ప్రత్యేక గుర్తింపు కావాలి…సినిమాలు కూడా చేసుకోవాలి…అంటేనే ఇటువంటి విమర్శలు ఎదుర్కోక తప్పదు.