డాడీ సినిమాల్ని నేనే తీస్తా.. అన్నట్టు పట్టుబట్టి కూర్చున్నాడు రామ్ చరణ్. చిరు 150వ సినిమా ‘ఖైదీ నెంబర్ 150’కి తనే నిర్మాత. ఆ సినిమా చరణ్ కి మంచి లాభాల్ని తీసుకొచ్చిపెట్టింది. ఇప్పుడు ‘సైరా’కీ ఆ బాధ్యతల్ని తనే తీసుకున్నాడు. చిరంజీవి – కొరటాల శివ కాంబినేషన్లో ఓ చిత్రం తెరకెక్కబోతోంది. దానికీ చరణే నిర్మాత. కాకపోతే మాట్నీ ఎంటర్టైన్మెంట్స్ సంస్థ ఇందులో భాగస్వామ్యం తీసుకుంది. చరణ్ సోలో నిర్మాత కాకుండా, మరొకరికి ఎందుకు పార్టనర్ షిప్ ఇచ్చినట్టు? ఈ సినిమాని ఒక్కడే నడిపించలేడా? అనే అనుమానాలు మొదలయ్యాయి.
వాస్తవానికి కొరటాల శివ తదుపరి సినిమా మాట్నీ ఎంటర్టైన్మెంట్స్లోనే తెరకెక్కించాలి. భరత్ అనే నేను తరవాత… కొరటాల మాట్నీ సంస్థకు ఫిక్సయ్యాడు. కాకపోతే అప్పట్లో అనుకున్న ప్రాజెక్ట్ వేరు. సడన్‌గా చిరంజీవి ఎంట్రీ ఇవ్వడంతో ప్రొడక్షన్ పగ్గాలు చరణ్ చేతికి వెళ్లిపోయాయి. కాకపోతే… మాట్నీ సంస్థ నుంచి కొరటాల శివ అడ్వాన్సు తీసుకున్న నేపథ్యంలో ఆ సంస్థనీ నిర్మాణంలో భాగస్వామిగా తీసుకున్నారు. అయితే సింహభాగం వాటా చరణ్‌దే అని టాక్. రూపాయికి పావలా మాత్రమే మాట్నీ ఎంటర్టైన్మెంట్స్కి ఇచ్చినట్టు సమాచారం.