‘అరిటాకు వేసి నాకు అన్నం కూడా పెట్టలేదు’ అంటూ వైసీపీ మత్తులో పడి చిన్ని కృష్ణ ఇచ్చిన స్టేట్మెంట్లు అప్పట్లో మెగా అభిమానుల్ని బాగా హర్ట్ చేశాయి. కాపు అనే ట్యాగ్ వేసుకొని చిన్ని కృష్ణ ఆ రోజు చేసిన హంగామా, పేలిన ప్రేలాపనలు మెగా ఫ్యాన్స్ ఎప్పటికీ మర్చిపోలేరు. అయితే… రోజులన్నీ ఒకేలా ఉండవు కదా? చిన్ని కృష్ణలో ప్రశ్చాత్తాపం మొదలైంది. కొన్ని రోజుల తరవాత మళ్లీ మైకు పట్టాడు. ‘ఎవరి పోగ్బలం వల్లో నేను అలా మాట్లాడాల్సివచ్చింది. నన్ను క్షమించు అన్నయ్యా..’ అంటూ ఓ వీడియో రిలీజ్ చేసి, చిరు కాళ్లమీద పడినంత పని చేశాడు. చిరంజీవికి పద్మ విభూషణ్ ప్రకటించిన తరవాత ఆయన్ని కలిసి అభినందనలు తెలిపాడు చిన్నికృష్ణ.
ఇటీవల చిరంజీవి పుట్టిన రోజు సందర్భంగా మళ్లీ చిన్నికృష్ణ చిరుని కలిశాడు. ‘ఇంద్ర’ రీ రిలీజ్ పురస్కరించుకొని ‘ఇంద్ర’ టీమ్ చిరుని కలిస్తే, అందులో చిన్నికృష్ణ కూడా ఉన్నాడు. ఇటీవల ఓ యూట్యూబ్ ఛానల్ కు చిన్నికృష్ణ ఓ ఇంటర్వ్యూ ఇచ్చాడు. అందులో అంతా మెగా స్తుతే. మొత్తానికి చిరు, చిన్నికృష్ణల మధ్య క్రమంగా గ్యాప్ తగ్గుతూ వచ్చింది. ఈ పరిణామం చిన్నికృష్ణలో మళ్లీ కాన్ఫిడెన్స్ పెంచినట్టు ఉంది. ‘నాకోసం ఏమైనా కథలు రాస్తే చెప్పు అని అన్నయ్య అడిగారు. అన్నయ్యతో మళ్లీ ఓ సినిమా తీస్తే.. వందేళ్లు గొప్పగా చెప్పుకొనే కథ రాస్తా. ఈసారి అన్నయ్యతో చేసే సినిమా రూ.500 కోట్లు సాధించడం మంచినీళ్లు తాగినంత సులభం. ఆ స్థాయిలో కథ రాస్త’` అంటూ మెగా ఫ్యాన్స్‌ని ఊరిస్తున్నాడు.
Read Also : చిన్ని కృష్ణ జ్ఞానోదయం… ఓ జీవిత కాల ఆలస్యం!
తనని తిట్టినవాళ్లనీ, ఛీ కొట్టినవాళ్లనీ క్షమించేయడం, మళ్లీ అక్కున చేర్చుకోవడం చిరంజీవికి అలవాటే. శత్రువు అయినా సరే, ఇంటికొస్తే ఆహ్వానించడం చిరులో కనిపించే గొప్ప గుణం. ఇది చిన్నికృష్ణ విషయంలో మరోసారి రుజువైంది. మరొకరైతే అన్నేసి మాటలు అన్నందుకు దగ్గరకు కూడా రానిచ్చేవాళ్లు కాదు. చిరు అన్నీ మర్చిపోయి ఇప్పుడు ‘కలిసి పని చేద్దాం’ అని ఆఫర్ ఇవ్వడం అంటే మామూలు విషయం కాదు. ఇప్పుడు చిన్నికృష్ణ చేయాల్సిదల్లా ఓ గొప్ప కథ రాసి, చిరంజీవికి కానుకగా ఇవ్వడం. ‘ఇంద్ర’ మ్యాజిక్‌ని తలదన్నే స్క్రిప్టు రాయడం. ఆ కసి, సత్తా చిన్నికృష్ణలో ఇంకా ఉన్నాయా? అనేదే ప్రశ్న. నిజంగా ఇది జరిగితే ఇప్పుడు చిరంజీవి క్షమించినట్టు, అప్పుడు మెగా అభిమానులూ చిన్నికృష్ణని క్షమించేస్తారు.