పవన్ ను బూతులు తిడతారు.. మళ్లీ తన దగ్గరకు వచ్చి తమ ఇంట్లో పెళ్లిళ్లకు.. శుభకార్యాలకూ రావాలని బతిమాలుతారు…అని కొంత మంది నేతలపై చిరంజీవి ఫైరయ్యారు. ఇలాంటి వారితో మాట్లాడాలన్నా …తనకు అసౌకర్యంగానే ఉంటుందని ఓ మీడియాకు ఇచ్చిన ఇంటర్యూలో తేల్చి చెప్పారు. చిరంజీవి చెప్పిన మాటలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. దీనికి కారణం ఇటీవలి కాలంలో పవన్ కల్యాణ్ వ్యక్తిగత జీవితంపై విమర్శలు చేయడం.. పవన్ ను దూషించడం ఎక్కువైపోయింది. ఇదంతా వైసీపీ నేతలే చేస్తూంటారు.
పేర్ని నానితో సహా అనేక మంది వైసీపీ కాపు నేతలు పవన్ కల్యాణ్ ను దూషించడమే తమ డ్యూటీగా పెట్టుకున్నారు. పవన్ ప్రభుత్వంపై విమర్శలు చేయడం ఆలస్యం వారు రంగంలోకి దిగుతారు. అయితే ఇలాంటి వారంతా చిరంజీవిని, పవన్ ను వేరు చేస్తూ మాట్లాడుతూంటారు. పవన్ కల్యాణ్ కన్నా.. జగన్ అంటే చిరంజీవికి అభిమానమని వారికి వారు ప్రకటించుకుంటూ ఉంటారు. ఇప్పుడు అలాంటి వాళ్లందరికి చిరంజీవి గట్టి సందేశం పంపారు.
పవన్ కల్యాణ్ ను రాజకీయంగా కానీ.. వ్యక్తిగతంగా కానీ విమర్శించే వారిని కలవడానికి కూడా తనకు ఇబ్బంది ఉంటుందని.. అలాంటి వారు రావొద్దని చిరంజీవి చెప్పకనే చెప్పేశారు. వారి వారి ఇళ్లలో శుభకార్యాలకు కూడా రానని .. మొహమాట పెట్టవద్దని.. చెప్పినట్లయింది. అయితే వైసీపీ నేతలకు ఇలాంటివి ఏమీ ఉండవని.. తుడిచేసుకుంటారని.. చిరంజీవి దగ్గరకు అదే పవిగా వెళ్తారన్న గుసగుసలు ఆ పార్టీలోనే వినిపిస్తున్నాయి.