దసరా, దీపావళి అయిపోయాయి. ఈ ఏడాది కి రావలసిన పెద్ద సినిమాలన్నీ కూడా రిలీజయిపోయాయి. ఇక ఈ ఏడాది కి రావలసిన పెద్ద సినిమాలు లేనట్టే. తదుపరి పెద్ద సినిమాల సీజన్ సంక్రాంతి కే మొదలవుతుంది. దీంతో ఖైదీ నంబర్ 150 తో చిరంజీవి ఈ ఏడాది లో సాధించిన రికార్డ్ పదిలంగా ఉండిపోయినట్టేనా? బాహుబలిని మినహాయించి వంద కోట్ల షేర్ సాధించిన సినిమా ఖైదీ నంబర్ 150 మాత్రమే.
అయితే ఈ ఏడాది చాలా ప్రిస్టీజియస్ సినిమాలు ఉండటం తో ఈ రికార్డ్ ఈ ఏడాదే బద్దలవడం ఖాయమనుకున్నారు. అలాగే ఖైదీ నంబర్ 150 తో చిరంజీవి వంద కోట్ల షేర్ని సాధించాడు కాబట్టి, ఇకపై వచ్చే పెద్ద సినిమాలన్నీ అవలీలగా వంద కోట్ల మార్కు దాటతాయని ట్రేడ్ పండితులు లెక్కలు కట్టారు. పైగా బాహుబలి తర్వాత తెలుగు సినిమాల పరిధి బాగా పెరిగింది. అలాగే తెలుగు సినిమాల ప్రి రిలీజ్ బిజినెస్ కూడా అమాంతం పెరిగింది. అయితే వంద కోట్ల షేర్ రావడం అంత ఈజీ కాదనేది తర్వాత అర్థమయింది. కాటమరాయుడు, డిజె, జై లవకుశ, స్పైడర్ లు రిలీజయినా కానీ చిరంజీవి సాధించిన వసూళ్లు తెచ్చుకోవడం ఎవరి వల్ల కాలేదు. అయితే ఈ సినిమాలన్నీ టాక్ పరంగా ఖైదీ 150 లాగా యునానిమస్ హిట్ టాక్ తెచ్చుకోలేదు. అయితే వీటిలో ఏవైనా హిట్టయి ఉంటే వంద కోట్ల షేర్ ఈజీగానే వచ్చేసి వుండేది.
ఏదేమైనా ఇక ఈ ఏడాదిలో రావాల్సిన భారీ చిత్రాలేమీ లేవు కనుక బాహుబలి 2ని మినహాయిస్తే వంద కోట్ల షేర్ సాధించిన సినిమాగా ఖైదీ నంబర్ 150 రికార్డు 2017 కి మిగిలిపోతుంది.