రామ్ చరణ్ తేజ్ నటించిన బ్రూస్లీ సినిమాలో చిరంజీవి కూడా ఒక అతిధి పాత్రలో మూడు నిమిషాల పాటు తెరపై కనిపిస్తారు. నిన్న జరిగిన ఆ సినిమా ఆడియో విడుదల కార్యక్రమానికి చిరంజీవి ముఖ్య అతిధిగా పాల్గొన్నారు. ఆ సందర్భంగా మాట్లాడుతూ బ్రూస్లీ సినిమాలో తనకు, రామ్ చరణ్ తేజ్ మధ్య సాగే డైలాగ్స్ చెప్పి ప్రేక్షకులను ఆనందపరిచారు. వారిద్దరి మధ్య సాగే డైలాగు ఇలాగ సాగుతుంది.
రామ్ చరణ్ తేజ్: “బాస్! మీ స్టామినాను, స్పీడ్ ను అందుకోవడం కష్టం!”
చిరంజీవి: నా స్టామినాకి, స్పీడుకి ఫ్యూయల్ నా అభిమానులే…మన అభిమానులే. నా కోసం ఎదురుచూస్తున్నారు. వాళ్ళకోసం వెళుతున్నా..బై.”
ఈ డైలాగ్స్ లో తండ్రీ కొడుకులు ఒకరినొకరు పొగుడుకోవడం, అభిమానుల కోసం పరితపించిపోతున్నట్లు చెప్పుకోవడం చూస్తే చాలా నవ్వు వస్తుంది. చిరంజీవి నిజంగా గొప్ప నటుడే కావచ్చును. కానీ ఆ విషయం ప్రేక్షకులు, అభిమానులు చెపితే వినడానికి చాల బాగుటుంది. కానీ సినిమాలో ఒకరినొకరు పోగుడుకోవడం కోసమే ఇటువంటి డైలాగులు సృష్టించడం చాలా ఎబ్బెట్టుగా ఉంది. ఒకవేళ కేవలం దాని కోసమే చిరంజీవి బ్రూస్లీ సినిమాలో నటిస్తే అది మరీ ఎబ్బెట్టుగా ఉంటుంది.
చిరంజీవి సినిమా పరిశ్రమకి తిరిగి వచ్చిన తరువాత ఆయన తన 150వ సినిమాలో కనిపిస్తారని అందరూ భావించారు. కానీ బ్రూస్లీ సినిమాలో నటించడం ద్వారా అదే ఆయన 150వ సినిమా అయింది. దర్శకుడి విజ్ఞప్తి మేరకే అందులో తను నటించానని చిరంజీవి చెప్పుకొన్నారు. అది వినడానికి బాగానే ఉంది. కానీ నిజంగానే అందుకే నటించారా లేక తన 150వ సినిమాపై అభిమానులలో చాలా భారీగా అంచనాలు ఉండటంతో వాటిని అందుకోలేక చతికిలపడితే నవ్వులపాలవుతాననే భయంతోనే బ్రూస్లీతో ‘మమ’ అనిపించేసారా? అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. బ్రూస్లీ హిట్టయితే తను నటించిన 150వ సినిమా హిట్టయినట్లు చెప్పుకొనే వెసులుబాటు ఉంటుంది. అప్పుడు తన 151వ సినిమాపై ఒత్తిడి తగ్గుతుంది. ఒకవేళ బ్రూస్లీ హిట్ కాకపోయినా అది తన కొడుకు రామ్ చరణ్ తేజ్ సినిమా అందులో తను జస్ట్ గెస్ట్ రోల్ మాత్రమే ప్లే చేసానని చెప్పి చేతులు దులుపుకొనే వెసులుబాటు కూడా ఉంటుంది. కానీ అప్పుడు తన 151వ సినిమాని మరింత జాగ్రత్తగా తీసుకోవలసి ఉంటుంది.
బాహుబలి కంటే తక్కువ స్థాయిలో ఉంటే అది ఆయన స్థాయికి తగదని రాంగోపాల్ వర్మ ముందరి కాళ్ళ బందం వేసిపడేయడంతో చిరంజీవిలో ఇంకా భయం పెరిగిపోయినట్లుంది. కానీ ఎంత గొప్ప హీరోకయినా జయాపజయాలు తప్పవనే సంగతి చిరంజీవికి తెలియని విషయం కాదు. కానీ తన 150వ సినిమా ఎక్కడ ఫ్లాప్ అవుతుందో అని భయపడుతూ చాలా అతిజాగ్రత్తలు తీసుకొంటున్నారు. చిరంజీవి కత్తిలాంటి సినిమా తీస్తారని అందరూ ఎదురు చూస్తుంటే ఆయన తమిళంలో హిట్ అయిన ‘కత్తి’ సినిమాని తెలుగులో రీమేక్ చేయడానికి సిద్దపడుతున్నారు. బహుశః అతి జాగ్రత్త, అతి భయం కారణంగానే ఆయన ‘తమిళ కత్తి’ పట్టుకొంటున్నట్లున్నారు. కానీ ఏదయినా సరే ‘అతి’ అయినప్పుడు అది బెడిసికొట్టే అవకాశాలే ఎక్కువని గ్రహిస్తే బాగుంటుంది.