హైదరాబాద్: కాంగ్రెస్ నాయకుడు, రాజ్యసభ సభ్యుడు చిరంజీవి ఎన్నాళ్ళనుంచో మనసులో దాచుకున్న కసిని వెళ్ళగక్కటానికి రాజమండ్రి పుష్కరఘాట్ దుర్ఘటన ఒక మంచి అవకాశాన్ని కల్పించింది. అదెలాగో చూడాలంటే ఫ్లాష్‌బ్యాక్‌లో 2009లోకి వెళ్ళాలి. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి సలహాదారుగా ఉన్న పరకాల ప్రభాకర్ గతంలో ప్రజారాజ్యంలో ఉండటం, సరిగ్గా 2009 ఎన్నికలముందు పార్టీకి రాజీనామాచేస్తూ ఒక ప్రెస్ మీట్ పెట్టి పార్టీలోని అవకతవకలను, చిరంజీవి, అల్లు అరవింద్‌లను ఉతికి ఆరేసి పీఆర్పీ విజయావకాశాలను తీవ్రంగా దెబ్బతీయటం అందరికీ గుర్తుండే ఉంటుంది. పరకాల ప్రభాకర్‌పై నాటినుంచి దాచుకున్న కసిని వెళ్ళగక్కటానికి చిరంజీవికి ఇవాళ్టికి అవకాశం దొరికింది. రాజమండ్రి దుర్ఘటనపై చిరంజీవి ఇవాళ ఏపీ పీసీసీ అధ్యక్షుడు రఘువీరారెడ్డితో కలిసి హైదరాబాద్‌లో పార్టీ కార్యాలయలో మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఏర్పాట్లలో చంద్రబాబునాయుడు ప్రభుత్వం వైఫల్యాన్ని తప్పుబడుతూనే, పనిలో పనిగా పరకాలనుకూడా ఓ రేంజ్లో ఆడుకున్నారు. పరిపాలనాపరంగా ఏమాత్రం అవగాహనలేని వ్యక్తి మీకు ప్రభుత్వ సలహాదారుగా, పుష్కరాలవద్ద కీలక వ్యక్తిగా ఉండటమేమిటని చంద్రబాబును ప్రశ్నించారు. అతనికి ఏమి చేతవునని పెట్టుకున్నారంటూ పరోక్షంగా పరకాలను ఉద్దేశించి అడిగారు. అలాంటి కాకా రాయుళ్ళను పక్కన పెట్టుకుని, వాళ్ళమీద ఆధారపడి ముఖ్యమంత్రి పుష్కరపనులను సమీక్షించేవారని ఆరోపించారు. మొత్తంమీద అటు చంద్రబాబును, ఇటు పరకాలను తిట్టటానికి దొరికిన అవకాశాన్ని భలే ఉపయోగించుకున్నారు చిరు! ఫరవాలేదు రాజకీయ నాయకుడిగా బాగానే ఎదుగుతున్నారు.