ఈమధ్య బాలకృష్ణ – చిరు మధ్య ఓ కోల్డ్ వార్ మొదలైంది. చిత్రసీమ – ప్రభుత్వం మధ్య జరిగిన సమావేశాలకు చిరు కేంద్ర బిందువుగా మారడం, ఆ సమావేశాలకు తనని పిలవలేదని బాలయ్య అలగడం తెలిసిన విషయాలే. జగన్‌తో మీటింగు కోసం బాలయ్యని పిలిచినా ఆయన వెళ్లలేదు. అంతే కాదు… చిరు పెద్ద రికాన్ని, దాసరి తరవాత ఆ బాధ్యతల్ని నెత్తిన పెట్టుకున్న వైనాన్ని కూడా బాలయ్య గుర్తించలేదు.
ఈ నేపథ్యంలోనే ఈరోజు బాలయ్య పుట్టిన రోజు వచ్చేసింది. ఈమధ్య చిరు ట్విట్టర్‌తో తెగ యాక్టీవ్‌గా ఉంటున్నాడు. ఎవరి పుట్టిర రోజు వచ్చినా, ట్విట్టర్ వేదికగా శుభాకాంక్షలు అందిస్తున్నాడు, చిరు ట్వీట్లు వైరైటీగానూ ఉంటున్నాయి. మరి బాలయ్య పుట్టిన రోజున చిరు స్పందిస్తాడా? ఎప్పటిలా ట్వీట్ వేస్తాడా? లేదంటే జరిగిన తతంగాన్ని మనసులో పెట్టుకుని లైట్ తీసుకుంటాడా? అనే చర్చ మొదలైంది. ఈ విషయమై అటు మెగా, ఇటు నందమూరి అభిమానులు ఆసక్తిగా మాట్లాడుకున్నారు.
అయితే చిరు మాత్రం ట్వీట్ వేశాడు. బాలయ్యకి పుట్టిన రోజు శుభాకాంక్షలు చెప్పేశాడు. “అరవైలో అడుగు పెడుతున్న మా బాలకృష్ణకు షష్టిపూర్తి శుభాకాంక్షలు. ఇదే ఉత్సాహంతో, ఉత్తేజంతో, ఆయురారోగ్యాలతో నిండు నూరేళ్ల సంబరం కూడా జరుపుకోవాలని. అందరి అభిమానం ఇలానే పొందాలని కోరుకుంటున్నా“ అని ట్వీట్ చేశాడు.
దాంతో… చిరు సైడ్ నుంచి ఈ గ్యాప్ ని పూడ్చడానికి తన వంతు ప్రయత్నం చేసినట్టైంది. ఈ ట్వీట్ పై బాలయ్య కూడా స్పందిస్తే ఇక అంతా హ్యాపీనే.