తెలంగాణలో మరో సంచలన విషయం వెలుగులోకి వచ్చింది. పేదల ఆరోగ్యం కోసం ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి అందించే సీఎం రిలీఫ్ ఫండ్ లో అవకతవకలు చోటు చేసుకున్నాయని తాజాగా సీఐడీ గుర్తించింది. రోగులకు చికిత్స అందించకుండానే నకిలీ బిల్లులను రూపొందించి సీఎంఆర్ఎఫ్ నిధులను కొట్టేశారని సీఐడీ తేల్చింది. ఈమేరకు పలు ఆసుపత్రులపై సీఐడీ అధికారులు కేసులు నమోదు చేశారు.
హైదరాబాద్ , ఖమ్మం , నల్గొండ, వరంగల్ , మహబూబాబాద్, కరీంనగర్ జిల్లాలోని మొత్తం 30ప్రైవేట్ ఆసుపత్రులపై ఆరు కేసులను సీఐడీ నమోదు చేసింది. బీఆర్ఎస్ హయాంలో గతేడాది ఏప్రిల్ కు ముందు ఈ దందా కొనసాగించాయని ఎఫ్ఐఆర్ లో సీఐడీ పేర్కొంది.
సీఎంఆర్ఎఫ్ నిధుల గోల్ మాల్ పై ఓ అధికారి ఫిర్యాదుతో రంగంలోకి దిగిన సీఐడీ.. పలు ప్రైవేట్ ఆసుపత్రుల నిర్వాకాన్ని బయటపెట్టింది. ఇప్పటికే ఆసుపత్రులపై కేసులు నమోదు చేసిన సీఐడీ.. ఇప్పుడు ఈ స్కామ్ వెనక ఎవరెవరి పాత్ర ఉందో తేల్చే పనిలో పడింది.
ఈ కేసులో గతంలోనే మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు వద్ద డేటా ఎంట్రీ ఆపరేటర్ గా పని చేసిన వ్యక్తిపై కేసు నమోదు చేశారు. దీనిపై హరీష్ కార్యాలయం స్పందిస్తూ.. అతనిని ఎప్పుడో విధుల నుంచి తొలగించామని, అతనితో హరీష్ కార్యాలయానికి ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేసింది.