ఏపీలో జరిగిన మద్యం అవకతవకలపై సీబీ సీఐడీతో విచారణ జరిపిస్తామన్నారు ముఖ్యమంత్రి చంద్రబాబు. వైసీపీ హయాంలో ఎక్సైజ్ శాఖలో జరిగిన అవకతవకలపై అసెంబ్లీలో శ్వేతపత్రం విడుదల చేసిన అనంతరం చంద్రబాబు మాట్లాడారు.
గత ప్రభుత్వ హయాంలో మద్యం అమ్మకాల్లో లక్ష కోట్ల నగదు లావాదేవీలు నేరుగా జరిగాయన్నారు. దీనిపై సీఐడీ దర్యాప్తుకు ఆదేశస్తున్నట్లు ప్రకటించారు. డిస్టలరీస్ నుంచి నేరుగా షాపులకు మద్యం తరలించారని.. కంపెనీలకు తరలించకుండా అక్రమంగా సొమ్ము చేసుకోవాలనే ఈ విధంగా వ్యవహరించారని అన్నారు. ఈమద్యం కుంభకోణంలో లక్ష కోట్ల అవకతవకలు జరిగాయని అన్న చంద్రబాబు..సీఐడీ విచారణలో అవసరమైతే ఈడీ సపోర్ట్ కూడా తీసుకుంటామని తెలిపారు.
మద్యం పాలసీతో ప్రజల ఆరోగ్యంతో చెలగాటమాడిన ఎవరిని వదలబోమని హెచ్చరించారు. రాష్ట్ర ఆదాయాన్ని ఎలా దుర్వినియోగం చేశారో వాటన్నింటిపై చర్యలు తీసుకుంటామని తెలిపారు.