జీవీఎంసీ స్థాయి సంఘం ఎన్నికల ఫలితాలు వైసీపీకి షాక్ ఇచ్చాయి. ఎమ్మెల్సీ ఎన్నికల వేళ ఈ ఫలితం ఫ్యాన్ పార్టీకి ఎదురుదెబ్బే..స్థాయి సంఘం ఎన్నికల్లో వైసీపీకి గెలుపుపై మిణుకు మిణుకు అనే ఆశలు ఉన్నప్పటికీ కూటమి హవాలో చిత్తయిపోయింది.
ఇప్పుడు ఈ ఎన్నికల ఫలితమే త్వరలో జరగబోయే ఎమ్మెల్సీ ఎన్నికల్లో పునరావృత్తం అయ్యే అవకాశం కనిపిస్తోంది. ఇప్పటికే విశాఖ జిల్లా స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు కూటమి పార్టీలోకి జంప్ అవ్వడం ప్రారంభించారు. ఎన్నికల నాటికి వైసీపీలో ఎంతమంది ఉంటారో స్పష్టంగా చెప్పలేని పరిస్థితి నెలకొంది.
Also Read : బాధ్యత ఉండక్కర్లేదా జగన్ !
ఒకవేళ వైసీపీలోనే కొనసాగినా ఎంతమంది బొత్సకు మద్దతుగా నిలుస్తారు..? అన్నది పెద్ద ప్రశ్నగా మారింది. ఈ సందేహాలు ఇలా ఉండగానే స్థాయి సంఘం ఎన్నికల్లో కూటమి ఘన విజయం ద్వారా..స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లోనూ వైసీపీ పరాభవం , కూటమి ఘన విజయంపై ఓ క్లారిటీ వచ్చేసినట్లేనని అంటున్నారు.
వరస ఎన్నికల్లో వైసీపీ ఓటమి పాలైతే మాత్రం ఆ పార్టీ ఉనికి ప్రశ్నార్థకంగా మారనుంది అని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. మరోవైపు ఎమ్మెల్సీ ఎన్నికల్లో వైసీపీని చావుదెబ్బకొట్టేందుకు కూటమి పార్టీలు గెలుపే లక్ష్యంగా ప్రణాళికలు సిద్దం చేస్తుండటంతో వైసీపీలో నిర్వేదం కనిపిస్తోంది.