నంద్యాల ఉప ఎన్నికపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రత్యేక శ్రద్ధ పెడుతున్నారు! ఈ నెల 21న నంద్యాలకు వెళ్లాలని కూడా ఆయన నిర్ణయించుకున్నారు. అంతేకాదు, కర్నూలు జిల్లా టీడీపీ నేతలతో శనివారం సమావేశమౌతున్నారు. ఉన్నట్టుండి కర్నూలు రాజకీయాలను ఇంత సీరియస్ గా తీసుకోవాల్సిన అవసరం ఏముందని అనుకుంటున్నారా..? పైగా, టిక్కెట్ కోసం పోటీ పడ్డ శిల్పా మోహన్ రెడ్డి వర్గం కూడా ఇప్పుడు పార్టీలో లేదు కదా.. టీడీపీలో ఆ సమస్య కూడా తీరిపోయి అంతా బాగున్నట్టే.. అనుకుంటే పొరపాటే! ఇన్నాళ్లూ శిల్పా వర్గం, భూమా అఖిల ప్రియ వర్గం మధ్య మాత్రమే వర్గ పోరు ఉండేది. కానీ, శిల్పా పార్టీని వీడిన తరువాత భూమా వర్గంలోనే మరో వర్గపోరు తీవ్రమౌతున్నట్టు సమాచారం. ఆ పంచాయితీ చంద్రబాబు వరకూ చేరడంతోనే ఆయన ప్రత్యేక దృష్టి పెడుతున్నారని చెబుతున్నారు.
భూమా నాగిరెడ్డి కుటుంబంతో కొన్ని దశాబ్దాలుగా ఎంతో సన్నిహితంగా ఉంటూ వస్తున్నారు ఏవీ సుబ్బారెడ్డి. అయితే, ఈ మధ్య అఖిల ప్రియ రాజకీయాల్లోకి వచ్చిన దగ్గర నుంచీ తనకు ప్రాధాన్యత తగ్గిపోయిందని సుబ్బారెడ్డి ఫీల్ అవుతున్నారట. పార్టీకి సంబంధించిన కీలక కార్యక్రమాలకు ఆయన్ని అఖిల ప్రియ దూరం పెడుతున్నారట. నంద్యాలలో అఖిల ప్రియ సొంతంగా వ్యవహరిస్తూ ఉండటం సుబ్బారెడ్డికి అసంతృప్తిగా మారిందని సమాచారం. అంతేకాదు, ఈ మధ్య టీడీపీ కౌన్సిలర్లను సమావేశపరచి తన అసంతృప్తిని సుబ్బారెడ్డి వ్యక్తం చేశారనీ, తనతో ఉంటారో, అఖిల ప్రియతో ఉంటారో చెప్పాలంటూ నేతలపై ఆయన ఒత్తిడి తెచ్చారనీ చెబుతున్నారు. మొత్తానికి, అఖిల ప్రియతో ఆయనకి కుదరడం లేదని ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో వ్యవహారాన్ని చక్కదిద్దేందుకు చంద్రబాబు సిద్ధమయ్యారు.
అయితే, ఇదే విషయాన్ని అఖిల ప్రియ ముందు ప్రస్థావిస్తే… అబ్బే, అలాంటి గొడవలేం లేవని కొట్టి పారేస్తున్నారు. సుబ్బారెడ్డి తనకు తండ్రి లాంటివారనీ, ఆయనతో జనరేషన్ గేప్ మాత్రమే ఉంటుందని ఆమె అన్నారు. అంశాలవారీగా ఏవైనా విభేదాలు ఉంటే ఇద్దరం కలిసి మాట్లాడుకునేంత చొరవ తమ మధ్య ఉందని ఆమె స్పష్టం చేశారు. ఏదో ఒక గ్యాప్ అయితే ఉందని మాత్రం ఆమె చెప్పకనే చెప్పడం గమనార్హం. నంద్యాల ఉప ఎన్నికను తెలుగుదేశం పార్టీ ప్రతిష్ఠాత్మకంగానే తీసుకుంది. సో.. ఈ నేపథ్యంలో నంద్యాలలో విభేదాలకు పరిష్కారం చూపేందుకు చంద్రబాబు సిద్ధమౌతున్నారు. అయితే, చంద్రబాబు టూర్ నాటికి సుబ్బారెడ్డి సర్దుకుపోతారా లేదో చూడాలి. ఈ విభేదాలు ఇంకా ముదిరితే టీడీపీకి ఇదో కొత్త సమస్యగా మారుతుందనడంలో సందేహం లేదు.