ఇటీవల `వ్యవస్థ` అనే వెబ్ సిరీస్ వచ్చింది. సిరీస్ బాగుందని అందరి టాక్. ఈ సిరీస్‌కి… ఆనంద్ రంగా దర్శకుడు. తనకి ఈ `వ్యవస్థ` మంచి పేరే తీసుకొచ్చింది. అయితే ఇదే వెబ్ సిరీస్… ఇద్దరి ఫ్రెండ్స్ మధ్య చిచ్చు రేపుతోంది.
దర్శకుడు ఆనంద్ రంగా, రచయిత రాజసింహా ఇద్దరూ మంచి మిత్రులు. ఇద్దరూ కలిసి కొన్ని సినిమాలకు పని చేశారు. పదేళ్ల క్రితం `బ్లాక్ కోట్` అనే కథ రాశాడు రాజసింహా. అది మిత్రుడు ఆనంద్ రంగాతో పంచుకొన్నాడు. ఇద్దరి మధ్యా ఇదే కథ గురించి డిస్కర్షన్లు నడిచాయి. అయితే.. ఇప్పుడు అదే కథని, రాజసింహ అనుమతి కూడా తీసుకోకుండా `వ్యవస్థ` గా తీసేశాడు. రైటర్‌గా.. తన పేరు వేసుకొన్నాడు. ఇది తెలిసి రాజసింహ గొడవకు దిగితే, చివరి క్షణాల్లో రచయితగా పేరు మార్చారు. ఆనంద్ ప్లేసులో రాజసింహ పేరు వచ్చి చేరింది. అయితే రెమ్యునరేషన్ కూడా సరిగా ఇవ్వలేదట. మాటలు కూడా రాజసింహే రాశాడు. అయితే మరో తమిళ రచయితని తీసుకొచ్చి, తనతో కొంత వర్క్ చేయించి, డైలాగ్ క్రెడిట్స్ కూడా రాజసింహకు రాకుండా చేశాడు. దాంతో.. రాజసింహకీ, ఆనంద్ రంగకీ మధ్య గ్యాప్ మొదలైంది. ఈ వెబ్ సిరీస్ విషయంలో తనకు న్యాయం జరగాలని రాజసింహ ఇప్పుడు పోరాటం చేయడానికి సిద్ధపడుతున్నాడు. ఇండస్ట్రీలో కథా చౌర్యం అతి సాధారణమైపోయింది. కాకపోతే.. స్నేహితుడి కథని తన కథగా చెప్పుకొనే ప్రయత్నం చేయడం, కనీసం పారితోషికం కూడా ఇవ్వకుండా తప్పించుకోవడం.. మాత్రం అన్యాయం. ఈ విషయంలో రాజసింహకి న్యాయం జరుగుతుందో లేదో చూడాలి.