ఏపీ అధికారులు తొందర పడుతున్నారు. ఓ వైపు పోలింగ్ జరిగి తీర్పు ఈవీఎంలలో ఉన్న సమయంలో అనుమానాస్పద నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఈ ఆఫీస్ సాఫ్ట్ వేర్ అప్ గ్రేడ్ పేరుతో మూసేస్తున్నారు. ఈ వ్యవహారం సంచలనంగా మారింది. ఇందులో కుట్ర కోణం ఉందన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
జగన్ పాలన అంతా రహస్యంగా సాగింది. జగన్ ప్రభుత్వం తాను తీసుకొచ్చిన జీవోల వివరాలు వెబ్ సైట్ లో ఉంచేది కాదు. ఆ విషయంలో హైకోర్టు నుంచి ఎన్నో మొట్టికాయలు తిన్నది. 2008లో ప్రారంభం అయిన జీవోఐఆర్ వెబ్సైట్ను జగన్ అధికారంలోకి వచ్చిన ఏడాది తర్వాత పూర్తిగా మూసేశారు. ప్రతీ జీవో గతంలో జీవోఐఆర్ లో ప్రభుత్వం బహిరంగంగా పెట్టేది. సామాన్యులు ఎవరైనా ఆ వెబ్ సైట్ ను చాలా ఈజీగా చూడవచ్చు. జీవోలు డౌన్ లోడ్ కూడా చేసుకోవచ్చు. కానీ, జగన్ ప్రభుత్వం మాత్రం ఆ సైటు మూసేసింది.
ప్రభుత్వ నిర్ణయాల తాలూకు డేటా, ఫైల్స్ అన్నీ ఈ-ఆఫీ్సలో ఉంటాయి. ఇప్పుడు దీన్నే సాఫ్ట్వేర్ అప్గ్రేడ్ పేరుతో మూసేస్తున్నారు. ఏపీ సర్కార్ పాలన పేరుతో వ్యాపారం చేసిందని.. కమిషన్లు దండుకుని నిర్ణయాలు తీసుకున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. ఈ క్రమంలో ప్రభుత్వం మారితే ఇరుక్కోకుండా అన్ని క్లియర్ చేసుకుందామన్న ఆలోచనలోనే సాఫ్ట్ వేర్ అప్ గ్రేడ్ పేరుతో.. ప్రభుత్వం ఆపద్ధర్మంగా ఉన్నప్పుడు క్లోజ్ చేస్తున్నారన్న ఆరోపణలు బలంగా ఉన్నాయి.