ఆదివాసీలంటే శౌర్యం, సహజ ప్రతిభ , నైపుణ్యం కల్గిన వ్యక్తులు అని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. అన్ని రంగాల్లో గిరిజనులు ముందంజలో ఉండాలన్నదే తమ లక్ష్యమని చెప్పారు. స్వాతంత్ర్యం వచ్చాక అన్ని వర్గాలు అభివృద్ధిలోకి వస్తున్నా..ప్రధానంగా ఆదివాసీ, గిరిజనులు ఇంకా వెనకబడి ఉన్నారని చెప్పారు. ఆదివాసీ ప్రాంతాల్లో ఇంకా డోలీమోతలు కనిపిస్తున్నాయని..ఇలాంటి వాటిని రూపుమాపేందుకు ప్రభుత్వం చర్యలు చేపడుతుందని భరోసా ఇచ్చారు.
విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రంలో ఆదివాసీ దినోత్సవంలో సీఎం చంద్రబాబు పాల్గొని మాట్లాడారు. ఆదివాసీ దినోత్సవం జరుపుకోవాలని జీవో నెంబర్ 127 జారీ చేశామని.. టీడీపీ హయాంలో ప్రతి ఏటా ఆదివాసీ దినోత్సం జరిపామని గుర్తు చేశారు. గత ఐదేళ్లలో వైసీపీ ఆదివాసీ దినోత్సవాన్ని పట్టించుకోలేదన్నారు. పాఠశాలలో ఉపాధ్యాయురాలుగా పని చేస్తూ , అంచెలంచెలుగా ఎదిగి రాష్ట్రపతి అయిన ద్రౌపది ముర్మును స్పూర్తిగా తీసుకోవాలని పిలుపునిచ్చారు. అల్లూరి సీతారామరాజు, ఏకలవ్యుడిని ఆదర్శంగా తీసుకోవాలన్నారు.
రాష్ట్రంలో 5.53 శాతం మంది ఆదివాసీలు ఉన్నారు. దేశవ్యాప్తంగా 10 కోట్ల 42లక్షల మంది గిరిజనులు ఉన్నారు. ప్రపంచంలో ఆఫ్రికా తర్వాత రెండో స్థానంలో గిరిజనులు ఉండేది భారతదేశంలోనేనని అన్నారు. 2011జనాభా లెక్కల ప్రకారం ఏపీలో 27లక్షల మంది ఆదివాసీలు ఉన్నారు. ఆదివాసీలు, గిరిజనులను చైతన్యం చేసేందుకు ఉమ్మడి రాష్ట్రంలో “చైతన్యం” అనే కార్యక్రమం చేపట్టామని చెప్పారు.
ఆధునిక టెక్నాలజీని ఆదివాసీ ప్రజలకు చేరవేయడమే కూటమి ప్రభుత్వం లక్ష్యమని చెప్పారు. ఏజెన్సీ ఏరియాలో బాక్సైట్ తవ్వకాలను నిలిపివేస్తే వైసీపీ ప్రారంభించిందని మండిపడ్డారు. పేదరికం లేని సమాజ నిర్మాణమే లక్ష్యంగా ముందుకు వెళ్తామని చెప్పారు. ఆదివాసీ, గిరిజన ప్రాంతాల్లో ప్రజలకు మౌలిక వసతులను కల్పించి అభివృద్ది చేస్తామన్నారు. ప్రజలకు ఆదాయం పెంచే మార్గాలపై దృష్టి పెడుతామని స్పష్టం చేశారు.
మంచి వస్తువును తయారు చేయడమే కాదు..పదిమందికి తెలియజేయాలని ప్రధాని రాష్ట్ర పర్యటనకు వచ్చినప్పుడు అరకు కాఫీ ఇచ్చి తాగించాం. గిరిజనుల ఉత్పత్తులను పదిమందికి పరిచయం చేస్తూ ఓ బ్రాండ్ తీసుకొచ్చామన్నారు. ప్రపంచవ్యాప్తంగా అరకు కాఫీకి గుర్తింపు తీసుకోస్తామన్నారు. ఆదివాసీలు అన్ని రకాలుగా పైకి వచ్చే వరకు అండగా ఉంటామని తెలిపారు.