అధైర్యపడకండి.. ఏ సహాయం కావాలన్నా అధికారులు అందుబాటులో ఉంటారు.. హెల్ప్ లైన్ నెంబర్ కు ఫోన్ చేయండి..వరద కొనసాగే వేళ ఆపత్కాలంలో ముఖ్యమంత్రులు ఇచ్చే భరోసా ఇది.కానీ, ఏపీ సీఎం చంద్రబాబు మాత్రం నేరుగా రంగంలోకి దిగిపోయారు. వరద నీటిలో అర్దరాత్రి బోటు ప్రయాణం భద్రతాపరంగా ఇబ్బంది అని చెప్పినా పట్టించుకోలేదు.
వరద నీటిలో చిక్కుకొని అల్లాడుతున్న ప్రజలను నేరుగా కలవాలనుకున్నారు. అధికారులతో హడావిడి చేయించినంత మాత్రానా ప్రజల్లో భరోసా నిండదని.. స్వయంగా తనే కదిలారు. మీ కోసం నేనున్నానని.. ఈ ఒక్క రాత్రి ధైర్యంగా ఉండండి..సోమవారనికల్లా మీ అందర్నీ సురక్షిత ప్రాంతాలకు తరలించే బాధ్యత తనది అంటూ హామీ ఇచ్చారు.
అసలే నిశిరాత్రి..అధికారులు వస్తారని కూడా ఊహించని విజయవాడలోని బుడమేరు సింగ్ నగర్ ప్రాంతంలో సీఎం చంద్రబాబు పర్యటించి భరోసా ఇచ్చారు. ముంపు ప్రాంతాల్లో సహాయక చర్యలను స్వయంగా పర్యవేక్షించారు. అధికారులతో కలిసి బోటులో తిరిగారు..వరదనీటిలో చిక్కుకున్న కుటుంబాల్లో ప్రతి ఒక్కరిదీ హృదయ విదారకమైన పరిస్థితి. వాటిని చూస్తుంటే హృదయం తరుక్కుపోతోంది.వారి మనోధైర్యం దెబ్బతినకుండా చర్యలు చేపడుతామని చంద్రబాబు హామీ ఇచ్చారు.
ఆదివారం ఉదయం నుంచి సీఎస్ , డీజీపీ, కలెక్టర్లు, ఉన్నతాధికారులతో టెలీ కాన్ఫరెన్స్ ద్వారా పరిస్థితిని సమీక్షించారు. ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు చేపట్టాలని ఆదేశిస్తూ.. రైతులకూ ఎలాంటి అన్యాయం జరగకుండా చూడాలన్నారు. వరద తగ్గగానే డ్రోన్ల ద్వారా పంట నష్టాన్ని అంచనా వేయాలన్నారు. ఇక, ఉదయం వరద ప్రాంతాల్లో పర్యటించిన చంద్రబాబు రాత్రి మరోసారి వరదనీటిలో చిక్కుకున్న ప్రాంతాల్లో పర్యటించి చంద్రబాబు బాధితులకు కొండంత అండగా నిలిచారు.
బాధితులను ఆదుకుంటామని.. అప్పటివరకు ఇక్కడే ఉంటానని చంద్రబాబు భరోసా నింపారు. అర్దరాత్రి మొదలైన వరద ప్రాంతాల్లో సీఎం పర్యటన సోమవారం తెల్లవారుజామున నాలుగు గంటల వరకు కొనసాగింది.