ఏపీ పారిశ్రామిక రంగంలో శ్రీసిటీది ఓ ప్రత్యేకమైన స్థానం. ప్రపంచ స్థాయి పరిశ్రమల్ని ఆకర్షించడంలో శ్రీసిటీ ముందు ఉంటుంది. ప్రభుత్వ ప్రోత్సాహకాలు తోడు కావడంతో పెద్ద ఎత్తున పరిశ్రమలు వస్తున్నాయి. ఇక్కడ ఉత్పత్తయ్యే వస్తువులు ప్రధానంగా ఎగుమతి చేసేవే. తాజాగా టీడీపీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మరిన్ని పరిశ్రమలు శ్రీసిటీలో ఏర్పాటు కాబోతున్నాయి.
పందొమ్మిదో తేదీన సీఎం చంద్రబాబునాయుడు శ్రీ సిటీలో పర్యటించబోతున్నారు. ఈ పర్యటనలో ఎనిమిది ఇండస్ట్రీయల్ యూనిట్స్‌కు శంకుస్థాపన చేస్తారు. మరో ఐదు కంపెనీలతో ఎంవోయూలు చేసుకుంటారు. వాటి పెట్టుబడుల ప్రతిపాదనలకు ఇప్పటికే ఆమోదం లభించింది. అలాగే పదహారు ఇండస్ట్రీయల్ యూనిట్ల కార్యకలాపాలను ప్రారంభిస్తారు.
శ్రీసిటీ ఉమ్మడి రాష్ట్రంలో చంద్రబాబు సీఎంగా ఉన్నప్పుడు రూపకల్పన చేసిన ప్రాజెక్టు. సెజ్ హోదా ఉన్న ఈ శ్రీసిటీకి పెద్ద ఎత్తున పరిశ్రమలు తీసుకు రావడానికి ఆ తర్వాత ప్రభుత్వాలు కూడా ప్రయత్నించాయి. కక్ష పూరితంగా వ్యవహరించలేదు. ఫలితంగా ఇండస్ట్రీయల్ కారిడార్లలో కీలకమైన ప్రాంతంగా శ్రీసిటీ అవతరించింది. పారిశ్రామిక వేత్తలకు అవసరమైన సౌకర్యాలు కల్పించడంలో శ్రీసిటీ ముందు ఉంటుంది. అందుకే పెద్ద ఎత్తున పరిశ్రమలు తరలి వస్తున్నాయి.