వరద బాధితులు అందరికీ న్యాయం చేస్తామని మరోసారి స్పష్టం చేశారు ముఖ్యమంత్రి చంద్రబాబు. అమరావతి మునిగిపోయిందని వైసీపీ నేతలు మళ్లీ తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సమయంలో సహాయం చేయడం చేతకాకపోతే మౌనంగా ఉండాలే కానీ, ఇలాంటి దుష్ప్రచారం చేయడం మానుకోవాలన్నారు.
విజయవాడకు బుడమేరు చాలా సమస్యగా తయారైందన్న చంద్రబాబు..చిన్న, చిన్న వాగులన్నీ కలిసి బుడమేరు పెద్దదిగా మారిందన్నారు. బుడమేరును గత ప్రభుత్వం పట్టించుకోలేదని… వాగులను కబ్జా చేయడమే ఈ దుస్థితికి కారణమని మండిపడ్డారు. వైసీపీ నేతలకు విమర్శలు చేసేటప్పుడు ఇంగిత జ్ఞానం ఉండాలన్నారు.
వరద బాధితులకు సాయం అందించడంలో అలసత్వం లేకుండా పని చేస్తున్నామని అన్నారు. మంగళవారం 9, 09 , 191 ఆహార ప్యాకెట్లు పంపిణీ చేశాం..గురువారం 6 లక్షల మందికి ప్యాకెట్లు అందజేశాం.. 8లక్షల మందికి వాటర్ బాటిల్స్ అందించాం..3 లక్షల లీటర్ల పాలు, 5 లక్షల బిస్కెట్ ప్యాకెట్లు అందించాం..5 లక్షల మంది భోజన ఏర్పాట్లు చేశాం..గర్భిణీలకు ప్రత్యేక వైద్యం అందించాలని ఆదేశించామన్నారు చంద్రబాబు.
అధికారులను కూడా వరద సహాయక చర్యల్లో పని చేయిస్తున్నామని..అనేక మంది స్వచ్చందంగా వచ్చి బురద ప్రాంతాల్లో తిరుగుతున్నారని గుర్తు చేశారు. వైద్య శిబిరాలు ఏర్పాటు చేశాం.. మందులు సరఫరా చేస్తున్నాం..7 లక్షల మందికిసరఫరా చేసినప్పుడు చిన్న, చిన్న సమస్యలు వస్తాయని , వాటిని భూతద్దంలో చూపడం మానుకోవాలన్నారు.
ఇలాంటి విపత్తును తన జీవితంలో ఎప్పుడు చూడలేదన్నారు చంద్రబాబు. వరద ప్రాంతాల్లో బోట్లకు ఎవరూ డబ్బులు ఇవ్వవద్దని.. డబ్బులు వసూలు చేసినట్టు తేలితే కేసులు నమోదు చేయిస్తానని సీరియస్ వార్నింగ్ ఇచ్చారు.