వరద సహాయక చర్యలో నిర్లక్ష్యంగా వ్యవహరించిన అధికారులపై కఠినంగా వ్యవహరిస్తామని హెచ్చరించారు ముఖ్యమంత్రి చంద్రబాబు. ఉదాసీనంగా వ్యవహరిస్తే అధికారులపై మాత్రమే కాదు.. మంత్రులపై కూడా చర్యలు తీసుకుంటామని తేల్చి చెప్పారు.
వరద బాధితులకు వంద శాతం ఆహరం పంపిణీ జరగాలని.. చిట్టచివరి బాధితుడి వరకూ సర్కార్ సాయం చేరాలనేది ప్రభుత్వ లక్ష్యమన్నారు. అందుకోసం అధికారులు సర్వశక్తులు ఒడ్డి పని చేయాలని స్పష్టం చేశారు. ఆహరం అందిందా? లేదా అనేది అధికారులే నిర్ధారించుకొని, ఒకవేళ ఆహరం అందకపోతే ఏర్పాట్లు చేయాలన్నారు.
బాధితుల బాధను అర్థం చేసుకొని అధికార యంత్రాంగం పని చేయాలని..మన కుటుంబమే అలాంటి కష్టంలో ఉంటే ఎలా వ్యవహరిస్తామో అలాగే నడుచుకోవాలని చంద్రబాబు ఆదేశించారు. అత్యవసర వేళల్లో అధికారులు బాధితుల పట్ల మానవత్వంతో వ్యవహరించాలని అన్నారు. అధికారులు సరిగా పని చేయకపోతే సహించేది లేదంటూ హెచ్చరించారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో ఆకస్మిక పర్యటనలు ఉంటాయన్న చంద్రబాబు.. ఎవరైనా అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నట్లు తేలితే కఠిన చర్యలు ఉంటాయన్నారు.
కొన్ని చోట్ల ఆహరం అందలేదని ఫిర్యాదులు వస్తున్నాయని..అందుకే క్షేత్రస్థాయిలో పరిస్థితులను ప్రజల నుంచి నేరుగా తెలుసుకునేందుకు ఐవీఆర్ఎస్ కండక్ట్ చేస్తున్నామన్నారు. ఇందుకు ప్రజలు స్పందించాలన్న చంద్రబాబు… వాటి ఆధారంగా చర్యలు తీసుకుంటామన్నారు.