ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి శనివారం విశాఖ పర్యటనకు వెళ్లాల్సి ఉంది. ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీ కుమార్తె వివాహానికి ఆయన హాజరు కావాల్సి ఉంది. ఎలాగూ వెళ్తున్నారు కాబట్టి అక్కడ గత ప్రభుత్వంలో చేపట్టి చివరి దశకు వచ్చిన అభివృద్ధి పనులను గత రెండేళ్ల కాలంలో కొంత మొత్తం పూర్తి చేశారు. వాటిని ప్రారంభించేలా ప్రణాళిక సిద్ధం చేశారు. టూర్ ఖరారైంది. ఏర్పాట్లు కూడా చేశారు. అయితే అనూహ్యంగా రాత్రికి రాత్రి సీఎం జగన్ విశాఖ టూర్‌ను క్యాన్సిల్ చేసుకున్నారు. ఈ విషయం మాత్రమే అధికారికంగా తెలిసింది. ఎందుకు రద్దు చేసుకున్నారో మాత్రం చెప్పలేదు.
కొద్ది రోజుల కిందట అమిత్ షాతో జరిగిన ముఖ్యమంత్రుల భేటీకి కూడా సీఎం జగన్ హాజరు కాలేదు. అదే రోజు ఉదయం ఆయన జిమ్ చేస్తూండగా కాలు బెణికిందని అందుకే వెళ్లడం లేదని కారణం చెప్పారు. విశాఖ టూర్ క్యాన్సిల్‌కు అలాంటి కారణం ఏమీ చెప్పలేదు. అత్యవసర సమావేశాలు.. సమీక్షలు.. పార్టీ పరమైన కార్యక్రమాలు లేకపోతే.. ఎవరైనా ముఖ్యమైన వ్యక్తి కలవడానికి వస్తున్నారేమోనని అంచనా వేస్తున్నారు.
సాధారణంగా ముఖ్యమంత్రి కార్యక్రమాలు ఫిక్సయిన తర్వాత బలమైన కారణం ఉంటే కానీ రద్దు కావు. అందుకే విశాఖ పర్యటన రద్దునకు కారణం ఏమిటా అని వైసీపీ వర్గాలు ఆలోచిస్తున్నాయి. టీడీపీ నేతలు మాత్రం ఈ టూర్ రద్దునకు కారణం.., తమ అధినేత చేసిన దీక్షగా చెబుతున్నాయి. టీడీపీ ఆఫీసుపై దాడి చేసిన వ్యవహారం తర్వాత చంద్రబాబు దీక్ష.. టీడీపీ శ్రేణుల పోరాట నినాదాలు ముఖ్యమంత్రిని మానసికంగా ఇబ్బంది పెట్టాయని అందుకే టూర్ రద్దు చేసుకున్నారని సెటైర్లు వేస్తున్నారు.