కొంత గ్యాప్ తర్వాత ప్రధానమంత్రి నరేంద్రమోడీతో సమావేశం అయ్యేందుకు సీఎం జగన్కు అపాయింట్మెంట్ లభించింది. సోమవారం ఆయన ఢిల్లీ వెళ్లనున్నారు. తెలుగు రాష్ట్రాల మధ్య నెలకొన్న జల వివాదాలు, ప్రాజెక్టుల వ్యవహారంతో పాటు ఏపీకి సంబంధించిన పలు కీలక అంశాలపై కేంద్ర పెద్దలతో జగన్ చర్చిస్తారని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి సవరించిన అంచనాలను ఆమోదించాలని అంశాల కోసం మూడేళ్లుగా ఏపీ ప్రభుత్వం కోరుతున్నా కేంద్రం పట్టించుకోవడంలేదు. ఈ కారణంగా పోలవరం పనులు ఎక్కడివక్కడే ఉండిపోయాయి. వీటినీ ప్రధాని దృష్టికి తీసుకెళ్తారని భావిస్తున్నారు.
అయితే ఇదంతా ప్రభుత్వ వెర్షన్. సీఎం జగన్ హోంమంత్రి అమిత్ షాను కూడా కలుస్తారన్న ప్రచారం జరుగుతోంది. ఈ మధ్య కాలంలో ఏపీలో అనూహ్యమైన పరిణామాలు జరుగుతున్నాయి. అమరావతికి బీజేపీ హండ్రెస్ పర్సంట్ మద్దతు ప్రకటించిన తర్వాత రాజకీయం మారిపోయింది. మూడు రాజధానుల బిల్లులు వెనక్కి తీసుకున్నారు . ఆ భూముల్ని తాకట్టు పెట్టే ప్రయత్నం చేస్తున్నారు. అదే సమయంలో ఏపీలో అర్థిక సమస్యలు పీకల మీదకు వచ్చి పడ్డాయి. ఇప్పుడు కొత్తగా రుణాలు అనుమతి లభించకపోతే ఏపీ ప్రభుత్వం పీకల్లోతు కష్టాల్లో కూరుకుపోతుంది.
రుణాల అనుమతి కోసం సీఎం జగన్ పట్టుబట్టే అవకాశం ఉంది. అదే సమయంలో రాజకీయ అంశాలపైనా చర్చించే అవకాశం ఉందని భావిస్తున్నారు.అయితే సీఎం జగన్ కొంత కాలంగా మోడీ అపాయింట్ మెంట్ కోసం చూస్తున్నారని.. ఇప్పుడు లభించిందని.. అనూహ్యమైన పరిణామం ఏమీ కాదని వైసీపీ వర్గాలు చెబుతున్నాయి.