ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి ఇంకా దావోస్ చేరుకోలేదు. ప్రపంచ ఆర్థిక వేదిక సదస్సు కోసం అత్యంత లగ్జరీ విమానాన్ని స్పెషల్గా బుక్ చేసుకుని.. సతీమణితో కలిసిన బయలుదేరిన ఆయన.. షెడ్యూల్ ప్రకారం దావోస్ చేరుకోలేదు. కానీ ఆయన లండన్ చేరుకున్నట్లుగా అధికారవర్గాలు చెబుతున్నాయి. ముఖ్యమంత్రితో పర్యటించిన బృందం ఆ ప్రత్యేక విమానంలో లేదు. వారు విడిగా దావోస్ చేరుకున్నారు. అయితే దావోస్ వెళ్లడానికి కోర్టు పర్మిషన్ తీసుకున్న సీఎం జగన్.. అనూహ్యంగా లండన్ వెళ్లడమే ఇప్పుడు చర్చనీయాంశమవుతోంది.
తెలంగాణ మంత్రి కేటీఆర్ కూడా ప్రస్తుతం లండన్లోనే ఉన్నారు. ఆయన కూడా లండన్ నుంచే దావోస్ టూర్ ప్లాన్ చేసుకున్నారు. గత నాలుగైదు రోజులుగా ఆయన రకరకాల సమావేశాల్లో పాల్గొంటున్నారు. సీఎం జగన్ లండన్లో పెట్టుబడిదారుల సమావేశాలు ఏమైనా ఏర్పాటు చేసుకున్నారా అన్నదానిపై స్పష్టత లేదు. ఆయన లండన్ వెళ్లినా ఆశ్చర్యం లేదుకానీ… ఎందుకు గోప్యంగా ఉంచారన్నది ఎవరికీ అంతుబట్టనివిషయంగా మారింది. ప్రజలందరికీ.. మొదట లండన్ వెళ్తున్నామని.. తర్వాత దావోస్ వెళ్తామని చెబితే.. ఇప్పుడు దావోస్ వెళ్లాల్సిన ఆయన లండన్లో దిగారన్న ప్రచారం జరగకుండా ఉండేది . కానీ ఎవరికీ తెలియకూడదన్న ఉద్దేశంతోనే ఇలా చేసినట్లుగా భావిస్తున్నారు.
ఇంతకూ సీఎం జగన్కు లండన్లో పనేమిటి అన్నదానిపై స్పష్టత లేదు. సొంత వ్యాపార వ్యవహారాలను చూసుకుంటారా లేకపోతే.. వ్యక్తిగత కుటుంబ పర్యటన చేస్తారా అన్నదానిపై క్లారిటీలేదు. అయితే ప్రజాధనంతో బుక్ చేసుకున్న అత్యంత లగ్జరీ విమానంతో ఇలా అధికారిక పర్యటనలు కాకుండా సొంత టూర్లు చేయడం విమర్శలకు కారణం అవుతోంది. ప్రతీ అంశంలో చెప్పేదొకటి.. చేసేది మరొకటి అన్నట్లుగా ఉండటంతో… ఏదో రహస్య కార్యకలాపాలు నిర్వహిస్తున్నారన్న అభిప్రాయానికి ఎక్కువ మంది వచ్చే అవకాశం ఏర్పడుతోంది.