పంజాబ్ గవర్నర్ రాజ్యాంగ వ్యతిరేకంగా వ్యవహరిస్తున్నారన్న ఆ రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలపై దాఖలైన పిటిషన్లో విచారణలో భాగంగా సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. ఆ వ్యాఖ్యలు హైదరాబాద్లో వినిపించడం ఆలస్యం కేసీఆర్ వెంటనే స్పందించారు. ఇబ్బంది పెడుతున్న గవర్నర్ తమిళిసైను సుప్రీంకోర్టుకు లాక్కెళ్లిపోతున్నారు. గవర్నర్ తమిళిసైను ప్రతివాదిగా చేర్చి… సుప్రీంకోర్టులో పిటిషన్ వేసేశారు. అసెంబ్లీ ఆమోదించిన బిల్లులు మొత్తం పది రాజ్ భవన్ లో పెండింగ్ లో ఉన్నాయని ఆమోదించడం కానీ తిరస్కరించడం కానీ చేయడం లేదని.. తెలంగాణ సర్కార్ ఆరోపణ. ఈ విషయంలో గవర్నర్ కు తక్షణం ఆదేశాలివ్వాలని తెలంగాణ సర్కార్ కోరుతోంది.
గత ఏడాది సెప్టెంబర్లో జరిగిన అసెంబ్లీ సమావేశాల్లో ఉభయ సభలు ఆమోదముద్ర వేసిన 8 బిల్లుల్లో ఒక్క బిల్లును మాత్రమే ఆమోదించారు. ఏడు బిల్లులు పెండింగ్లో ఉన్నాయి. ఇటీవల జరిగిన బడ్జెట్ సమావేశాల్లో ఆమోదించిన బిల్లుల్లో ద్రవ్య వినిమయ బిల్లుకు వెంటనే ఆమోదముద్ర వేసిన గవర్నర్ తమిళి సై మరో మూడు బిల్లులపై ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. దీంతో పది బిల్లులపై గవర్నర్ నిర్ణయం తీసుకోవాల్సి ఉన్నది. ఇటీవల బడ్జెట్ సమవేశాలకు ముందు బడ్జెట్ను గవర్నర్ ఆమోదించకపోవడంతో తెలంగాణ సర్కార్ హైకోర్టుకెు వెళ్లింది. చివరికి తానే వెనక్కి తగ్గి బడ్జెట్ సమావేశాల సందర్భంగా గవర్నర్ ప్రసంగానికి తెలంగాణ సర్కార్ ఆమోదం తెలిపింది.
ప్రసంగంలోనూ ఎలాంటి వివాదం ఏర్పడకపోవడంతో ప్రభుత్వం, గవర్నర్ మధ్య ఉన్న వివాదాలు ఇక కొలిక్కి వచ్చినట్లేనని అనుకున్నారు. కానీ తమిళిసై మాత్రం బిల్లులను ఇంకా ఆమోదించలేదు. ముందస్తు ఆలోచనలతో ఎంతో కీలకమైన బిల్లులు అందులో ఉన్నాయని భావిస్తున్న తెలంగాణ సర్కార్ ఆమోదం కోసం చేయని ప్రయత్నం లేదు. ఇప్పుడు సుప్రీంకోర్టుకు విషయం చేరింది. దీనిపై ఎలాంటి స్పందన వస్తుందో మరి !