అకాల వర్షాలతో పంటలు పూర్తిగా నష్టపోయిన రైతులు పడుతున్న కష్టం అంతా ఇంతా కాదు. సర్వం కోల్పోయామన్న బాధ వారిలో కనపిస్తోంది. అన్ని రకా పంటల నష్టం కలిపి రూ. పది వేల కోట్ల వరకూ ఉంటుందని అంచనా కానీ ప్రభుత్వం మాత్రం పట్టించుకోవడం లేదు. చంద్రబాబు, పవన్ వెళ్లినప్పుడు.. వారు ఏ ఊళ్లకు వెళ్తారో తెలుసుకుని ఆయా ఊళ్లలో ధాన్యాన్ని ఎత్తిస్తున్నారు కానీ ఇతర రైతుల గురించి పట్టించుకోవడం లేదు. కానీ సీఎం కోసం ఓ మహాయజ్ఞాన్ని రూ. పది కోట్లకుపైగా ఖర్చుతో నిర్వహిస్తున్నారు.
విజయవాడ ఇందిరా గాంధీ స్టేడియంలో ‘అష్టోత్తర శతకుండాత్మక చండీ, రుద్ర, రాజశ్యామల, సుదర్శన సహిత శ్రీ లక్ష్మీ మహా యజ్ఞం’ ను ప్రభుత్వం నిర్వహిస్తోంది. మే 12 నుంచి మే 17 వరకు ఆరు రోజుల పాటు జరుగుతుంది. ఇందు కోసం రూ. పది కోట్లు వరకూ ఖర్చు పెడుతున్నరు. అన్ని ప్రధాన ఆలయాల ఖాతాల నుంచి సొమ్మును ఇందు కోసం ఊడ్చారు. రాష్ట్ర ప్రభుత్వ వర్గాలన్నీ ఈ యజ్ఞంపై దృష్టి పెట్టాయి. అన్ని శాఖలూ ఎంతో కొంత ఖర్చు పెట్టుకుని సహకరిస్తున్నాయి.
ఈ యజ్ఞం ఎందుకంటే సీఎం జగన్ బాగుండాలనట. ఈ విషయాన్ని దేవాదాయ మంత్రే చెప్పారు. తర్వాత సీఎం వ్యక్తిగతంగా బాగుండాలని కాదని.. రాష్ట్రం బాగుండాలని చెప్పుకొచ్చారు. రాష్ట్రం బాగుండాలంటే.. ప్రజలు బాగుండాలి. వారు బాగుంటేనే రాష్ట్రం బాగున్నట్లు. కానీ అసలు రైతులు ఆదుకోండి మహా ప్రభో అంటూంటే.. కనీసం పట్టించుకోవడం లేదు. వారు బాగోలేదని.. ఇప్పుడు రాష్ట్రం ఏం బాగుంటుంది ?