దిశ పోలీస్ స్టేషన్ను ముఖ్యమంత్రి జగన్ ప్రారంభించారు. ఈ పోలీస్ స్టేషన్ ప్రారంభానికి దిశ చట్టం ఆమోదం పొందాల్సి ఉంది. దిశ చట్టాన్ని చేసిన ముఖ్యమంత్రి.. దాని ప్రకారం.. ఈ పోలీస్ స్టేషన్ ను ఏర్పాటు చేశారు. కానీ ఆ చట్టం ఇంత వరకూ ఆమోదం పొందలేదు. కేంద్రం దగ్గరే ఉంది. ఆమోదం పొందిన తర్వాతే.. అమలు చేయడం… అనేది సంప్రదాయం. సంప్రదాయం మాత్రమే కాదు… ఓ విధానం. ఆమోదం పొందకుండా.. ఓ చట్టాన్ని అమలు చేయడం అంటే.. రాజ్యాంగాన్ని ఉల్లంఘించడమే. అలాంటి పనులు ప్రభుత్వం చేయకూడదు. కానీ ఏపీ ప్రభుత్వం చేస్తోంది.
లేని “దిశ చట్టం” అమలు చేసేస్తున్న సీఎం..!
తెలంగాణలో దిశ ఘటన జరిగితే.. ఏపీ సీఎం ఎక్కువగా స్పందించారు. దిశ పేరుతో దేశంలో ఎక్కడా లేని విధంగా 21రోజుల్లో ఉరి వేస్తామంటూ చట్టం అసెంబ్లీలో ఆమోదించారు. ఇందులో ఎన్నో లూప్ హోల్స్. ఐపీసీ, సీఆర్పీసీ సెక్షన్లను… సవరిస్తున్నట్లుగా ఈ చట్టంలో పేర్కొన్నారు. ఓ కేంద్ర చట్టాన్ని… కేంద్ర పరిధిలో ఉండే.. ఐపీసీ, సీఆర్పీసీని.. ఓ రాష్ట్రం మార్చడం సాధ్యమా..? ఈ విషయం తెలియని వారు ప్రభుత్వాలను నడుపుతారా..? లాంటి సందేహాలు వస్తే.. అందరూ ఏపీ వైపు చూడొచ్చు. ఇప్పుడీ చట్టం.. కేంద్రం వద్ద ఉంది. వారు ఆమోదించాలంటే.. సవాలక్ష అనుమానాలు తీర్చుకోవాల్సి ఉంది. దాని కోసం బిల్లును వెనక్కి పంపారు కూడా. అయినప్పటికీ..అది పెండింగ్లో ఉంది. సీఎం మాత్రం.. చట్టం అమలును ప్రారంభించేశారు.
ఏపీలో ఉన్న చట్టాల అమలు కావేంటి..?
మహిళలపై ఆత్యాచాలు.. వైసీపీ సర్కార్ అధికారంలోకి వచ్చిన తర్వాతనే పెరిగిపోయాయని రికార్డులు చెబుతున్నాయి. తిరుపతిలో.. పిడుగురాళ్లలో.. దాచేపల్లిలో .. గుంటూరులో .. పలాసలో.. ఇలా చెప్పుకుంటూ పోతే.. గత ఎనిమిది నెలల రికార్డులు తీస్తే.. మహిళలు చిన్నారులపై జరిగిన దారుణాలు ఎన్నో. కానీ.. ఒక్కరంటే.. ఒక్కరి విషయంలోనూ పోలీసులు కఠినంగా వ్యవహరించిన దాఖలాలులేవు. ఎందుకంటే.. నిందితులు ఎక్కువ మంది అధికార పార్టీ తో రాసుకుపూసుకుతిరిగేవారే. చాలా మంది బాధితులకు ప్రభుత్వమే పరిహారం ప్రకటించి నోరు మూయించింది. కానీ నిందితుల్ని కఠినంగా శిక్షించిన దాఖలాల్లేవు. దీనికి కారణం చట్టాల్లేకపోవడం కాదు.. దిశ చట్టం కాకపోవడమూ కాదు. ఐపీసీ, సీఆర్పీసీ, పోక్సో , నిర్భయ లాంటి చట్టాలెన్నో ఉన్నాయి. అసలు సమస్య అమలు చేయకపోవడమే.
లా అండ్ ఆర్డర్లో చిత్ర విచిత్ర పాలన..!
పోలీసులు ఇలా కూడా వ్యవహరిస్తారా.. అన్నంత దారుణంగా ఏపీలో పరిస్థితులు ఉన్నాయి. ఓ వైపు సోషల్ మీడియాలో.. వైసీపీ నేతలు, కార్యకర్తలు ఇతర పార్టీల మహిళల్ని.. అత్యంత దారుణంగా దూషిస్తూంటారు. వారి పోస్టులను పోలీసులు భావప్రకటనా స్వేచ్చగా చూస్తారు. అదే ఇతర పార్టీల వారు ప్రభుత్వ విధానపర నిర్ణయాలను విమర్శించినా.. బూతుగానే భావించి అరెస్ట్ చేశారు. మాజీ ముఖ్యమంత్రిపై చెప్పులు, రాళ్లు వేస్తే.. భావప్రకటనా స్వేచ్చ.. కానీ రైతులు ప్రజాస్వామ్యయుతంగా నిరసన చేస్తే.. చట్ట ఉల్లంఘన అని ప్రకటించి లాఠీచార్జ్ చేస్తారు. చట్టాలు.. ఒకరి కోసం.. ఒక పార్టీ కోసమే.. పని చేస్తున్నాయి. ఇంత దారుణమైన పరిస్థితి ఆంధ్రలో ఉంది. ఓ పాలకుడు.. సంకుచిత మనస్థత్వంతో ఉంటే ఎలాంటి పరిస్థితులు ఉంటాయో.. అవన్నీ ఇప్పుడు ఏపీలో కనిపిస్తున్నాయి.