ఆంధ్రప్రదేశ్లో ఏం జరుగుతుందో కేంద్రం వద్ద మొత్తం రికార్డు ఉందని.., కొంత మంది ఐఏఎస్ అధికారుల్ని రీకాల్ చేసే అవకాశం ఉందని ఏపీ బీజేపీ ఎంపీ సీఎం రమేష్ చేసిన సంచలన వ్యాఖ్యలు ఇప్పుడు రాజకీయవర్గాల్లో చర్చనీయాంశమవుతున్నాయి. ప్రత్యేకంగా పోలీసుల గురించి మాట్లాడటానికే ప్రెస్మీట్ పెట్టినట్లుగా ఆయన కాస్త ఘాటుగా పోలీసులకు వార్నింగ్లు ఇచ్చారు గతంలో ఇతర రాష్ట్రాల్లో పోలీసులకు ఏం జరిగిందో తెలుసా అంటూ హింట్ కూడా ఇచ్చారు.
రాష్ట్రంలోని పోలీస్ వ్యవస్థపై కేంద్ర ప్రభుత్వం టెలిస్కోపుతో చూస్తుందని … అతి త్వరలోనే పోలీస్ వ్యవస్థ ప్రక్షాళన స్పష్టం చేశారు. ఏపీలో పోలీసు ఉన్నతాధికారుల తీరు సరిగ్గా లేదని, వ్యవస్థలు ముఖ్యం అనే విషయాన్ని వారు ఎందుకు మర్చిపోతున్నారని ప్రశ్నించారు. అందుకే, అవసరమైతే కేంద్రం కొందరు ఐపీఎస్ అధికారులను రీ కాల్ చేస్తుందంటూ వ్యాఖ్యానించారు. ఇప్పటికే కొన్ని రాష్ట్రాల్లో పోలీసు ఉన్నతాధికారుల విషయంలో కేంద్ర ప్రభుత్వం ఏ విధంగా వ్యవహరించిందో చూశామని గుర్తు చేశారు. ఏపీలో కూడా అలాంటి పరిస్థితులే రానున్నట్లు చెప్పారు.
రాజ్యాంగ విరుద్ధంగా ఎవరు వ్యవహరించినా కేంద్రం జోక్యం చేసుకునేలా రాజ్యాంగమే వెసులుబాటు కల్పించిందని సీఎం రమేష్ చెప్పుకొచ్చారు. మరి ఇప్పటి వరకూ ఎందుకు పట్టించుకోలేదుఅంటే.. వైఎస్ జగన్ మొదటిసారి ముఖ్యమంత్రి అయ్యారు కాబట్టి.. మెల్లగా అర్థం చేసుకుంటారని బీజేపీ ఇన్నాళ్లూ వేచి ఉందని, ఇకపై చర్యలు చూస్తారని ఆయన స్పష్టం చేశారు.