కేంద్ర బడ్జెట్ లో తెలంగాణకు అన్యాయం జరిగిందని తెలంగాణ అసెంబ్లీలో చర్చ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి.. ప్రధాని మోడీపై తీవ్ర విమర్శలు చేశారు. తామేమి ప్రధాని సొంత రాష్ట్రమైన గుజరాత్ సంపదను తెలంగాణకు కేటాయించాలని కోరలేదన్నారు. కేంద్రానికి పన్నుల రూపంలో తెలంగాణ నుంచి అధిక నిధులు వెళ్తున్నా.. తెలంగాణకు మాత్రం కేంద్రం మొండి చేయి చూపుతుందన్నారు. కేంద్రం వైఖరిని నిరసిస్తూ ఈ నెల 27న జరగనున్న నీతి అయోగ్ సమావేశాన్ని బహిష్కరిస్తున్నట్లు రేవంత్ కీలక ప్రకటన చేశారు.
పార్లమెంట్ ఎన్నికలకు ముందు మోడీ తెలంగాణ పర్యటనలో ప్రధానిని రేవంత్ బడేభాయ్ అని ప్రస్తావించడంతో.. రేవంత్ – మోడీ మధ్య దోస్తీ కుదిరిందని బీఆర్ఎస్ ఆరోపణలు చేసింది. ఈ అసెంబ్లీ సమావేశాల్లోనూ ఇదే అంశాన్ని బీఆర్ఎస్ లేవనెత్తింది. శాసన సభలో కేంద్రం వైఖరిపై చర్చ సందర్భంగా ప్రధానిని ఉద్దేశించి రేవంత్ పదునైన విమర్శలు చేయడం బీఆర్ఎస్ ఆరోపణల్లో పస లేకుండా చేసినట్లు అయింది.
Also Read : కేంద్ర బడ్జెట్ పై చర్చ.. రేవంత్ నిర్ణయం వెనక ఇంత పెద్ద వ్యూహమా?
ఇక, బీజేపీతో దోస్తీ లేదని నిరూపించుకోవాల్సింది ఇప్పుడు బీఆర్ఎస్సే. కొద్ది కాలంగా బీజేపీపై విమర్శలు చేసేందుకు ఆ పార్టీ సాహసించడం లేదు. కేంద్ర బడ్జెట్ కేటాయింపులపై అసంతృప్తి వ్యక్తం చేసినా.. అందులోనూ రేవంత్ ను లాగారు. చోటేభాయ్ కు బడేభాయ్ ఇచ్చిన గిఫ్ట్ అంటూ రేవంత్ పై విమర్శలు గుప్పించారు.
తనపై వస్తోన్న ఆరోపణలకు రేవంత్ అసెంబ్లీలో చేసిన ప్రసంగం ద్వారా నోరు మూయించారు. కానీ, బీజేపీలో బీఆర్ఎస్ విలీనం , పొత్తు అంటూ ప్రచారం జరుగుతోన్న నేపథ్యంలో కమలంతో తమకు ఎలాంటి దోస్తాన్ లేదని రూడీ చేసుకోవాల్సిన బాధ్యత గులాబీ పార్టీపైనే ఉంది. ఇందుకోసం ఇప్పుడు బీఆర్ఎస్ ఏం చేస్తుంది అన్నది చూడాలి.