కర్ణాటక ముఖ్యమంత్రి యడ్యూరప్ప… నైతికత లేకుండా చెలరేగిపోతున్నారు. అసెంబ్లీలో బలం నిరూపించుకోక ముందే తీవ్రమైన అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్నారు. ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన వెంటనే ఆయన చేసిన పని.. తనకు అనుకూలంగా ఉండే పోలీస్ ఉన్నతాధికారులకు బెంగళూరుకు ట్రాన్స్ఫర్ చేయడం. సాయంత్రానికి వారందర్నీ బెంగళూరుకు చేర్చారు. కొత్త అడ్వకేట్ జనరల్‌ను నియమించుకున్నారు. కొత్త పర్సనల్ సెక్రటరీని ఏర్పాటు చేసుకున్నారు. పరిపాలనా పరంగా కీలకమైన నిర్ణయాలను యడ్యూరప్ప యథేచ్చగా తీసుకుంటున్నారు.
నిజానికి యడ్యూరప్ప ప్రమాణస్వీకారమే వివాదాస్పదం అవుతోంది. దానిపై సుప్రీంకోర్టు ఏ క్షణమైనా రూలింగ్ ఇవ్వనుంది. అయినా సరే అందిన అధికారంతోనే ప్రభుత్వాన్ని నిలబెట్టుకునేందుకు ఆయన నైతికతకు తిలోదకాలిస్తున్నారు. ఏ ప్రభుత్వమైన.. అసెంబ్లీలో బలం నిరూపించుకోక ముందు… ఒక్క ప్యూన్‌ను కూడా బదిలీ చేయడానికి అంగీకరించదు. కానీ యడ్యూరప్ప మాత్రం దేన్నీ పట్టించుకోవడం లేదు. కాంగ్రెస్, జేడీఎస్ ఎమ్మెల్యేలున్న రిసార్ట్ వద్ద భద్రతను తొలగించారు. పోలీసులతో సోదాలు చేయించేందుకు సిద్ధమయ్యారు.
కొంత మంది కేసులున్న ఎమ్మెల్యేలను, వారి కుటుంబసభ్యులను ఇన్‌కంట్యాక్స్, ఎన్ఫోర్స్ మెంట్ డైరక్టరేట్ అధికారులు నేరుగా ఇళ్లకెళ్లి బెదిరింపులకు దిగుతున్నారు. ప్రలోభాలకు గురి చేస్తున్నారు. దీనిపై జేడీఎస్ అధినేత కుమారస్వామి బహిరంగంగా ఆరోపణలు చేస్తున్నా ఎవరూ పట్టించుకోవడం లేదు. కేంద్ర సంస్థలను రాజకీయ అవసరాల కోసం బీజేపీ యథేచ్చగా వాడేసుకుంటోంది. పోలీసులు, అధికారుల సాయంతో.. ఎమ్మెల్యేలను బ్లాక్ మెయిల్ చేసేందుకు .. బలం నిరూపించుకోని ముఖ్యమంత్రి కూడా… విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. ఏ ముఖ్యమంత్రి అయినా…ముందు ప్రమాణస్వీకారం చేసి.. బలం నిరూపించుకున్న తర్వాతే అధికారిక కార్యక్రమాలు ప్రారంభిస్తారు. కాన యడ్యూరప్ప.. మాత్రం… బల నిరూపణకే .. అధికారాన్ని ఉపయోగిస్తున్నారు. దేశంలో ఇంత దారుణంగా అధికార దుర్వినియోగం చేసి.. ప్రభుత్వాన్ని నిలబెట్టుకునే ప్రయత్నాలు చేస్తున్న ఘటనలు.. ఇటీవలి కాలంలో చూడలేదన్న అభిప్రాయాలు దేశ ప్రజల్లో వ్యక్తమవుతున్నాయి.