ప్రముఖ సాఫ్ట్ వేర్ సంస్థ కాగ్నిజెంట్ అమెరికా తర్వాత అతిపెద్ద క్యాంపస్ ను హైదరాబాద్ లో ఏర్పాటు చేయబోతుంది. భారీ విస్తరణ ప్రణాళికతో ఉన్న కాగ్నిజెంట్ హైదరాబాద్ లో మరో 15వేల మందికి నేరుగా ఉద్యోగాలిచ్చేంత పెద్దగా విస్తరించబోతుంది.
దాదాపు 10లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంతో రాబోతున్న ఈ కొత్త క్యాంపెస్ గురించి అమెరికాలో పర్యటిస్తున్న సీఎం రేవంత్ రెడ్డి, ఐటీ మంత్రి శ్రీధర్ బాబుతో కంపెనీ ప్రతినిధులు భేటీ అయ్యారు. కొత్త సెంటర్ కు సంబంధించిన ఒప్పందం కూడా చేసుకున్నారు.
ఈ సెంటర్ ఏర్పాటుకు సంబంధించి గతంలో దావోస్ లో సీఎం రేవంత్ రెడ్డితో కంపెనీ ప్రతినిధులు భేటీ అయినప్పుడే ప్రాథమికంగా నిర్ణయం జరిగింది. ఇప్పుడు పూర్తిస్థాయిలో ఒప్పందం కూడా జరిగింది.
ఐటీ సేవలతో పాటు ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్, మెషిన్ లెర్నింగ్, క్లౌడ్ సొల్యూషన్స్ వంటి ఆధునాతన సాంకేతికతలపై కొత్త క్యాంపస్ నుండి దృష్టిసారించబోతున్నట్లు కంపెనీ ప్రకటించింది.
తమ సేవలకు కేవలం హైదరాబాద్ కే పరిమితం చేయకుండా… తెలంగాణలోని ద్వితీయ శ్రేణి నగరాలకు విస్తరించే ప్రణాళిక చేయాలని, మీకు అవసరం అయిన అన్ని సదుపాయాలను ప్రభుత్వం కల్పించేందుకు రెడీగా ఉందని సీఎం కంపెనీ ప్రతినిధులకు వివరించారు. భవిష్యత్ లో తమ ఆలోచనలు అటు వైపు ఉంచాలని కోరగా…అందుకు కంపెనీ సానుకూలంగా స్పందించినట్లు సీఎంవో వర్గాలు తెలిపాయి.