రాజకీయ రంగ ప్రవేశం కోసం.. సరైన వేదిక కోసం చూస్తున్న నటుడు అలీ.. తెలుగుదేశం పార్టీ వైపు మొగ్గు చూపుతున్నట్లుగా తెలుస్తోంది. నెల రోజుల వ్యవధిలోనే ఆయన రెండో సారి టీడీపీ అధినేత, ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుతో సమావేశమయ్యారు. దాదాపుగా పదిహేను నిమిషాల పాటు తన రాజకీయ భవిష్యత్‌పై చర్చించారు. గుంటూరు తూర్పు టిక్కెట్‌పై హామీ ఇస్తే.. ఆయన తెలుగుదేశం పార్టీలో చేరిపోవడానికి సిద్ధమయ్యారు. అయితే.. గుంటూరు తీర్పు విషయంలో టీడీపీలో చిక్కు ముళ్లు ఉన్నాయి. అక్కడ ఇన్చార్జ్గా ఉన్న మద్దాళి గిరి గత ఎన్నికల్లో ఓడిపోయినప్పటికీ. పార్టీ కార్యక్రమాలు చురుగ్గా నిర్వహిస్తున్నారు.
అలీ మొదట వైసీపీతో కూడా చర్చలు జరిపారు. ఆ తర్వాత.. జనసేన అధినేత పవన్ కల్యాణ్‌తోనూ సమావేశమయ్యారు. కానీ.. ఏ పార్టీలో టిక్కెట్ వస్తుందో.. ఆయనకు క్లారిటీ రాలేదు. ముందు నుంచి ఆయన తెలుగుదేశం పార్టీతో సన్నిహితంగా వ్యవహరిస్తూ ఉన్నారు కాబట్టి.. ఆ పార్టీపైనే ఎక్కువ ఆశలు పెట్టుకున్నారు. మంత్రి గంటా శ్రీనివాసరావు లాంటి వాళ్లతో ఆయనకు సత్సంబంధాలు ఉన్నాయి. సినీ ఇండస్ట్రీలో… మురళీమోహన్, అశ్వనీదత్ లాంటి … వారితో …లాబీయింగ్ చేసుకుని టీడీపీలో టిక్కెట్ తెచ్చుకోవాలనే పట్టుదలతో ఉన్నారు.
అలీ రెండు సార్లు… చంద్రబాబుతో సమావేశమైనప్పటికీ.. టిక్కెట్ పై క్లారిటీ మాత్రం రాలేదని టీడీపీ వర్గాలు చెబుతున్నాయి. అందుకే ఆయన చేరిక గురించి… ఎలాంటి స్పందనా వ్యక్తం చేయడం లేదంటున్నారు. ముందుగా పార్టీలో చేరితే…సర్వేలు.. ఇతర అంచనాలను పరిగణనలోకి తీసుకుని.. దానికి తగ్గట్లుగా.. టిక్కెట్ ను ఎక్కడ కేటాయించాలో అక్కడ కేటాయిస్తామని.. కుదరకపోతే… ఎమ్మెల్సీగా పంపిస్తామని.. టీడీపీ పెద్దలు అలీకి చెబుతున్నట్లు తెలుస్తోంది. దీనిపై… అలీనే ఆలోచించుకోవాల్సి ఉందంటున్నారు. మొత్తానికి రాజకీయ రంగం ప్రవేశం చేయాలనుకుంటున్న అలీకి… ప్రస్తుత పరిస్థితులు అంత క్లారిటీగా అనిపించడం లేదు.