ఊర్లో పెళ్లికి కుక్కల హడావుడి అనే మాట వేణుస్వామి లాంటి వాళ్లని చూస్తుంటే మళ్లీ మళ్లీ గుర్తొస్తుంటుంది. శుభమా అని నాగచైతన్య – శోభిత కొత్త జీవితాన్ని మొదలెట్టాలనుకొంటే, ‘వాళ్లిద్దరూ ఎంతో కాలం కాపురం చేయలేరు.. విడిపోతారు..’ అంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశాడు వేణుస్వామి. ఇలాంటి ఊసుపోని కబుర్లు వేణుస్వామి చాలాసార్లు చెప్పాడు. అడక్కుండానే భవిష్యత్ దర్శనం చేయించాడు. ఇండియా వరల్డ్ కప్ గెలుస్తుందని, జగన్ మళ్లీ అధికారంలోకి వస్తాడని.. ఇలా నోటికొచ్చింది చెప్పుకొంటూ పోయాడు. అదే జరిగితే ‘నేను చెప్పా కదా, జరిగింది చూడండి’ అని కాలర్ ఎగరేసేవాడు. కానీ అవేం జరక్కపోయేసరికి వేణు స్వామి దారుణంగా ట్రోల్ అయ్యాడు. అయినా మనోడి బుద్ది మారలేదు.
నాగచైతన్య వ్యవహారంలో అడక్కుండానే వేలు పెట్టేశాడు. ఇప్పుడు విమర్శల పాలయ్యాడు. అయితే ఈసారి వేణుస్వామి విషయంలో చూస్తూ ఊరుకోకూడదని చిత్రసీమ డిసైడ్ అయిపోయింది. ఇక మీదట ఇలాంటి చెత్త వ్యాఖ్యలు చేయకుండా చర్యలు తీసుకొనే పనిలో భాగంగా ముందు అడుగు వేసింది. నాగచైతన్య – శోభితలపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసినందుకు చర్యలు తీసుకోవాల్సిందిగా తెలంగాణ మహిళా కమీషన్ను కోరుతూ జర్నలిస్ట్ యూనియన్ ఫిర్యాదు చేసింది. దీనిపై మహిళా కమీషన్ ఛైర్ పర్మన్ శారద సానుకూలంగా స్పందించారు. ఈ విషయమై దర్యాప్తు చేసి, వేణు స్వామిపై, అతని వీడియోలు ప్రసారం చేసిన టీవీ ఛానళ్లపై చర్యలు తీసుకొంటామని స్పష్టం చేశారు.
Also Read : సమంత Vs శోభిత… సోషల్ మీడియాలో రచ్చ
అసలు ఒకరి జీవితం గురించి మాట్లాడే హక్కు వేణు స్వామికి ఎవరిచ్చారు? ‘మా జాతకాలు చెప్పండి’ అంటూ వేణు స్వామిని చైతూ కానీ, శోభితగానీ అడిగారా? కేవలం పబ్లిసిటీ పైత్యంతో చేస్తున్న అరాచకాలు ఇవి. అయినా అయిన దానికీ, కానిదానికీ కొన్ని యూ ట్యూబ్ ఛానళ్లు వేణు స్వామిని పిలవడం, ఇంటర్వ్యూలు తీసుకొంటూ వాటిని వైరల్ చేయడం.. కొంతమందికి ఫ్యాషన్ అయిపోయింది. ఇప్పుడు వాటికీ చెక్ పడే అవకాశాలు పుష్కలంగా కనిపిస్తున్నాయి. ‘ఇక మీదట రాజకీయాలకు సంబంధించిన విషయాల్లో జోస్యం చెప్పను’ అంటూ వేణు స్వామి ఒట్టు వేసుకొన్నాడు. వ్యవహారం చూస్తుంటే ‘అసలు జాతకాలే చెప్పను మహాప్రభో’ అనేలా ఉన్నాడు. ఆ రోజు ఎంతో దూరంలో లేదు.