విశాఖ స్థానిక సంస్థల ఉప ఎన్నికల్లో గెలుపొందటం.. ఆ వెంటనే మండలిలో ప్రతిపక్ష నేత బాధ్యతలు దక్కడంతో .. వైసీపీలో బొత్స సత్యనారాయణ లక్కీ అని అంతా అనుకున్నారు. కానీ , బొత్సకు ఈ సంతోషం ఎక్కువ కాలం నిలిచేలా లేదు.
ఎమ్మెల్సీలు సైతం వైసీపీని వీడెందుకు సిద్దం అవుతున్నారు. వారంతా కూటమి పార్టీలో చేరేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. ఇప్పటికే పోతుల సునీత వైసీపీకి, ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేశారు. మరికొంతమంది కూడా అదే బాటలో ఉన్నారు.
ఇక, కీలక బిల్లుల ఆమోదం కోసం మండలిలో కూటమి సర్కార్ కు మెజార్టీ అవసరం. వైసీపీ ఎమ్మెల్సీలు పలువురు జంప్ చేసేందుకు కూటమి పార్టీలు ఎప్పుడు గేట్లు ఓపెన్ చేస్తాయా? అని వెయిట్ చేస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం అక్టోబర్ లో అసెంబ్లీ సమావేశాలు నిర్వహించే అవకాశం ఉండటంతో అంతకుముందే ఎమ్మెల్సీలను చేర్చుకునే అవకాశం ఉందనే ప్రచారం జరుగుతోంది.
దాదాపు ఇరవై మంది ఎమ్మెల్సీలు కూటమి పార్టీలో చేరే అవకాశం ఉంది.. అదే జరిగితే బొత్స అపోజిషన్ లీడర్ పదవికి వచ్చిన నష్టమేమి లేకపోయినా.. అతి తక్కువ మంది ఎమ్మెల్సీలతో మండలిలో కూటమిని ఎలా ఎదుర్కొంటారనే సందేహాలు వ్యక్తం అవుతున్నాయి. సార్వత్రిక ఎన్నికల్లో ఓటమి చెందగానే..ఎమ్మెల్సీగా ఎన్నికై..కేబినెట్ ర్యాంక్ పొందినా బొత్సకు ఆ సంతోషం మున్నాళ్ళ ముచ్చటగానే మిగిలిపోనుందని అంటున్నారు.