తన పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేస్తానని షర్మిలే కాంగ్రెస్ వద్దకు వెళ్లారు. ఆమెను కలుపుకుంటే మొత్తానికే నెత్తి మీద తుండుగుడ్డ ఖాయమని అంతా లైట్ తీసుకున్నారు. అయినా సరే తన మద్దతు కాంగ్రెస్ కే అని పోటీ నుంచి విరమించుకున్నారు. పైగా తాను మీ పార్టీకే మద్దతు పలికాను కాస్త గుర్తుంచుకోండి అన్నట్లుగా రాహుల్ కు లేఖ కూడా రాశారు. ఇంతగా కాంగ్రెస్ ప్రాపకం కోసం షర్మిల ఎందుకు ప్రయత్నిస్తున్నారు ?
ఇదే షర్మిల, ఆమె తల్లి విజయమ్మ .. .. సోనియాను బూచిగా చూపి రాజకీయంగా ఎదిగారు. కాంగ్రెస్ పార్టీ వల్ల ఉన్నత స్థానికి ఎదిగిన వైఎస్ హెలికాఫ్టర్ ప్రమాదంలో మరణించిన తర్వాత ఆయన ఫ్యామిలీ మొత్తం … సీఎం పదవి ఇవ్వలేదని సోనియా గాంధీని నిందించడం ప్రారంభించారు. చాలా సార్లు వైఎస్ హెలికాఫ్టర్ ప్రమాదం వెనుక సోనియా ఉన్నారని ఆరోపించారు. అలా ఆరోపించిన వారిలో విజయమ్మ, షర్మిల ముందు ఉంటారు. ఉపఎన్నిక సమయంలో వీరు చేసిన డ్రామాలు అందరికీ తెలుసు. అయినా ఇప్పుడు షర్మిల ఎందుకు కాంగ్రెస్ వెంట పడుతున్నారు.
అసలు షర్మిల తెలంగాణలో రాజకీయ పార్టీ పెట్టడం వెనుక టార్గెట్ కాంగ్రెస్ అన్న వాదన ఉంది. ఎంతో కొంత బలం ఉందని చూపించి కాంగ్రెస్ లో విలీనం కోసం ప్రయత్నించారు. చివరికి మద్దతు ప్రకటించారు. ఇదంతా భవిష్యత్ రాజకీయ వ్యూహం అంటున్నారు. కేంద్రం అండ లేకపోతే జగన్ రెడ్డి నెల కూడా బయట ఉండలేరు. అందుకే ముందుగా ఓ రోడ్ మ్యాప్ ను రెడీ చేసుకోవడం మాత్రం రాజకీయాల్లో కీలకం. వైఎస్ జగన్, షర్మిల భిన్నమైన దారుల్లో కలిసి ఇలా రాజకీయం చేస్తున్నారని .. అందుకే కాంగ్రె్స పార్టీకి ఒకరు దగ్గరగా ఉండేలా ప్లాన్ చేసుకున్నారని కొంత మంది విశ్లేషిస్తున్నారు. ఇప్పటికే వేల కోట్లు కాంట్రాక్టులు పొందిన పొంగులేటి జగన్ రెడ్డి ప్రతినిధిగా కాంగ్రెస్లో చేరిపోయారు. కారణం ఏదైనా షర్మిల ప్లాన్ మాత్రం.. ఏపీ రాజకీయాలతో ముడిపడి ఉంది. అది భవిష్యత్ రాజకీయం.