రాజకీయ పునరేకీకరణ పేరుతో అందరికీ ఫలమో.. పండో ఆఫర్ చేసి టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పార్టీలో చేర్చుకున్నారు. గత కొన్నేళ్లుగా ఈ ప్రక్రియ జరిగింది. ఇప్పుడు అలా చేరిన నేతలకు చుట్టుపక్కల అవకాశాలు కనిపిస్తున్నాయి. దీంతో వారిలో అసంతృప్తి బయటకు వస్తోంది. అలా చేరిన నేతల్లో చాలా మంది మంచి పదవుల్లో ఉన్నారు. వారి చేరిక వల్ల అవకాశాలు కోల్పోయిన నిఖార్సైన టీఆర్ఎస్ నేతల్లోనూ ఇంకా అసంతృప్తి పెరిగింది. ఇలాంటి వారినందర్నీ తమ వైపునకు చేర్చుకోవాలని కాంగ్రెస్, టీఆర్ఎస్ తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నాయి. ఎవరికి వారు భారీ ఆఫర్లు ఇస్తున్నారు.
మంచిర్యాల జిల్లా జడ్పీ చైర్మన్ నల్లాల భాగ్యలక్ష్మికి టీఆర్ఎస్లో జరుగుతున్న అవమానాన్ని కాంగ్రెస్ నేతలు గుర్తించి… ఆపరేషన్ అమలు చేశారు. పార్టీలో చేర్చేసుకున్నారు. ఇప్పటికే చాలా మందితో చర్చలు జరుపుతున్నామని చెబుతున్నారు. రేవంత్ రెడ్డి ఈ విషయంలో దూకుడుగా ఉన్నారు. ఆయన చేరికల విషయంలో ఎక్కడా తన ప్లాన్ బయటకు రానీయడం లేదు. పార్టీ మారిన కొంత మంది ఎమ్మెల్యేలతో కూడా మాట్లాడుతున్నట్లుగా చెబుతున్నారు. కాంగ్రెస్ పార్టీకి కాస్త ఊపు వచ్చినట్లుగా కనిపిస్తూండటంతో ఇతర నేతల్లో కూడా ఆశలు చిగురిస్తున్నాయి. ఇప్పటికే పలువురు టీఆర్ఎస్ నేతలతో కాంగ్రెస్ నేతలు టచ్‌లోకి వెళ్లారని అనేక పేర్లు ప్రచారంలోకి వస్తున్నాయి.
అయితే ఏ పార్టీలో ఎక్కువ చేరికలుంటే ఆ పార్టీకి ఎక్కువ మైలేజ్ వస్తుందన్న ఉద్దేశంతో బీజేపీ కూడా తీవ్ర ప్రయత్నాలు చేస్తోంది . ఢిల్లీలో అధికారంలో ఉండటంతో అడ్వాంటేజ్ తీసుకుని ప్రయత్నాలు చేస్తున్నారు. బండి సంజయ్ పాదయాత్రలో పెద్ద ఎత్తున చేరికలు ఉంటాయని ప్రచారం చేసుకున్నారు కానీ ఎవరూ చేరలేదు. కొండా విశ్వేశ్వర్ రెడ్డి వంటి వారు చేరుతారని చెప్పుకున్నారు. కానీ వారి వ్యూహం వేరేగా ఉంది. బీజేపీ నుంచి ఈటల, కాంగ్రెస్ నుంచి రాజగోపాల్ రెడ్డి, విశ్వేశ్వర్ రెడ్డి కలిసి కొత్త పార్టీ పెడతారన్న చర్చ కూడా జరుగుతోంది. అయితే వీరందర్నీ బీజేపీలో చేర్చుకోవాలని ప్రయత్నిస్తున్నారు. పలువురితో చర్చలు జరుపుతున్నారు. వాళ్లూ..వీళ్లు చేరబోతున్నారని మీడియాకు లీకులు ఇస్తున్నారు.
కారు ఇప్పటికే ఓవర్ లోడ్ అయింది. తెలంగాణ లో పార్టీ గురించి కేసీఆర్ పెద్దగా పట్టించుకోవడం లేదు. పూర్తిగా కేటీఆర్‌కే వదిలేశారు. ఈ క్రమంలో బీజేపీ, కాంగ్రెస్‌ల ప్రయత్నాలు మరింత జోరందుకున్నాయి. చేరికలు ఎక్కువగా చేరితే ఎక్కువ పాజిటివ్ వేవ్ వస్తుంది. దీని కోసం బీజేపీ, కాంగ్రెస్ రెండూ టీఆర్ఎస్ నేతలపైనే కన్నేశాయి.