తెలంగాణలో పొలిటికల్ వార్ రోడ్ల మీదకు ఎక్కుతోంది. అయితే ఏపీలోలా రాళ్లేసుకునే రాజకీయాలు కాకుండా… విడివిడిగా ఎవరి బలప్రదర్శన వారు చేయనున్నారు. సెప్టెంబర్ 17వ తేదీన తెలంగాణ విమోచన దినోత్సవం సందర్భంగా బీజేపీ, కాంగ్రెస్ భారీ సభలు ఏర్పాటు చేస్తున్నాయి. సెప్టెంబర్ 17వ తేదీన సికింద్రాబాద్ పెరేడ్ గ్రౌండ్లో భారీ బహిరంగ సభ నిర్వహించాలని బీజేపీ ప్లాన్ చేసింది. ఇక ఈ సభకు కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా వచ్చే అవకాశం ఉంది. గత ఏడాది కూడా కేంద్రం తరపున అధికారికంగా సెప్టెంబర్ 17ను చేశారు. ఇప్పుడు మరోసారి చేయబోతున్నారు.
తెలంగాణలో ఈనెల 16, 17 తేదీలలో కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ కమిటీ సమావేశాన్ని హైదరాబాద్లో నిర్వహిస్తోంది. ఈ క్రమంలోనే సెప్టెంబర్ 17వ తేదీన భారీ ర్యాలీ నిర్వహించి బహిరంగ సభ నిర్వహించాలని కాంగ్రెస్ పార్టీ ప్లాన్ చేస్తోంది. ఈ భారీ బహిరంగ సభను కాంగ్రెస్ పార్టీ చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. భారీ జన సమీకరణ చేయాలనకుంటున్నందున శివారు ప్రాంతాల్లో ప్రైవేటు స్థలాల్లో ఏర్పాటు చేయాలన్న ఆలోనచకు వస్తున్నట్లగా తెలుస్తోంది. ఈ సభకు కాంగ్రెస్ అగ్రనేతలంతా హాజరవుతారు. అంటే ఒకే రోజు అటు బీజేపీ, ఇటు కాంగ్రెస్ బహిరంగసభలు జరగనున్నాయి.
విమోచనా దినోత్సవం విషయంలో మొదటి నుంచి కార్నర్ అవుతోంది బీఆర్ఎస్ పార్టీనే. ఉద్యమ సమయంలో అధికారికంగా నిర్వహిస్తామని ఉద్యమాలు చేసి అధికారంలోకి వచ్చాక సైలెంట్ అయింది. గత ఏడాది బీజేపీ అధికారికంగా నిర్వహిస్తున్నదని తెలిసిన తర్వాత జాతీయ సమైక్యతా దినోత్సవం అంటూ కొత్త పాట అందుకున్నారు. ఈ సారి అదే చేస్తారా.. మరేదైనా ప్లాన్ చేస్తారా అన్నది చూడాల్సి ఉంది.