సోనియా గాంధీతో ప్రారంభించారు.. ఇప్పుడు మండవ వెంకటేశ్వరరావు పేరు వినిపిస్తోంది. ఈ మధ్యలో కనీసం ఓ డజన్ పేర్లు పరిశీలనకు వచ్చి ఉంటాయి. కానీ ఎవర్నీ ఖరారు చేయలేకపోతున్నారు. ఇదీ కాంగ్రెస్లో ఖమ్మం అభ్యర్థిపై జరుగుతున్న సర్కస్. సోనియా గాంధీ పోటీ చేయాలని … మొదట పీసీసీ తీర్మానం చేసి కేంద్ర పార్టీకి ఇచ్చింది. గెలుపు సులువు కావడమే ఖమ్మం స్పెషాలిటీ అని.. అందుకే సోనియా అక్కడ్నుంచి పోటీ చేయాలనుకున్నారని భావించారు.
అయితే సోనియా లేకపోతే మాకు అంటూ.. ఖమ్మం జిల్లాకు చెందిన కీలక నేతలంతా పట్టుబట్టారు. సోనియా రాజ్యసభకు వెళ్లారు. తర్వాత ప్రియాంక పేరు పరిశీలనలోకి వచ్చింది., ఆమె పోటీ చేయడంపై సందేహాలు ఉన్నాయి. ఈ లోపు అందరూ ఎవరి ప్రయత్నాలు వారు చేస్తున్నారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాకు ముగ్గురు మంత్రులు ఉంటే.. ముగ్గురూ తమ కుటుంబ సభ్యుల కోసం ప్రయత్నించారు. కానీ హైకమాండ్ తర్జన భ ర్జన తర్వాత చాన్స్ లేదని చెప్పింది.
తర్వాత ఓ మాజీ మంత్రి అల్లుడు దగ్గర్నుంచి బీసీ నేతల వరకూ చాలా పేర్లు పరిశీలించారు చివరికి నందమూరి సుహాసిని పేరు కూడా తెరపైకి వచ్చింది. ఇప్పుడు నిజామాబాద్ జిల్లాకు చెందిన మండవ వెంకటేశ్వరరావుపేరు తెరపైకి వచ్చింది. కమ్మ సామాజికవర్గానికి ఒక్క సీటు కూడా కేటాయించనందున ఖమ్మం సీటు ఇవ్వాలన్న ప్రతిపాదనలు వస్తున్నాయి. అందుకే మండవ పేరు పరిశీలనలోకి వచ్చింది.
ఇక రేసులో పారిశ్రామిక వేత్త వంకాయలపాటి రాజేంద్రప్రసాద్, మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పేర్లు కూడా వినిపిస్తున్నాయి. చివరికి ఎవరిని ఖరారు చేస్తారో కానీ.. సులువుగా గెలిచేస్తామని అనుకుంటున్న సీటులో అభ్యర్థి ఎంపిక ఇంత క్లిష్టంగా ఉంటుందా … అని నేతలు సైతం ఆశ్చర్యపోతున్నారు.